గుంటూరు
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. తన కొడుకు చనిపోతే ప్రభుత్వం 5 లక్షల సాయం చేసిందని.. అందులో మంత్రి అంబటి వాటా అడిగారని ఓ మహిళ ఆరోపించింది. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మంత్రి అంబటిని ఉద్దేశించి ఇదే విధమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ ఆరోపణలను మంత్రి అంబటి రాంబాబు ఖండించగా.. తాజాగా ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన మహిళలనే ఇలాంటి ఆరోపణలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. మరోవైపు సోషల్ మీడియాతో వేదికగా అంబటి రాంబాబుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే తనపై మహిళ చేసిన ఆరోపణలపై స్పందించిన అంబటి రాంబాబు.. అందులో వాస్తవం లేదని చెప్పారు. వైసీపీ అధికారంలో వచ్చాక నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 12 రైతు ఆత్మహత్యలను గుర్తించి.. వారి కుటుంబాలకు 7 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడం జరిగిందన్నారు. తన సవాలుకు పవన్ కల్యాణ్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్యాకేజీ తీసుకునే సన్నాసి రాజకీయాలు తాను చేయనని అన్నారు. రూ. 2 లక్షల తీసుకునే దౌర్భగ్యం ఉంటే తన పదవిని తృణప్రాయంగా వదిలేస్తానని చెప్పారు. ఆగస్టు 20న మృతిచెందిన వారికి సీఎం రిలీఫ్ పండ్ డబ్బులు ఇప్పించామని చెప్పారు. చెరో ఐదు లక్షలు ఇప్పించే బాధ్యత తానే తీసుకున్నానని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జేబు పార్టీ తనపై ఆరోపణలు చేస్తే తానేలా ఊరుకుంటానని అన్నారు. తనపై తప్పుడు ట్రోల్స్ చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన అభిమాని చనిపోతే వారి కుటుంబాన్ని కనీసం పరామర్శించని కుసంస్కారి పవన్ కల్యాణ్ అని విమర్శించారు.