న్యూ డిల్లీ డిసెంబర్ 20
ఇది నిజంగా షాకింగే. ఏపీలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం ఇప్పటికే పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. దీనిపై ప్రతిపక్షాలు కార్మిక సంఘాలు ఇతర ప్రజా సంఘాలు పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరోవైపు జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని విమర్శలు ఉన్నాయి.ఇప్పుడు ఇక విమానాశ్రయాల వంతు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తిరుపతి రాజమండ్రి విమానాశ్రయాలు ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించడం గమనార్హం.నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ కింద కేంద్ర ప్రభుత్వం 2022–25 మధ్యకాలంలో దేశంలో 25 విమానాశ్రయాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో విజయవాడ తిరుపతి రాజమండ్రి విమానాశ్రయాలు ఉన్నాయి. విమానాశ్రయాల ప్రైవేటీకరణపై రాజ్యసభలో కేరళ సీపీఎం సభ్యుడు ఎలమారం కరీం అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వీకేసింగ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు విమానాశ్రయాల ప్రైవేటీకరణ వ్యవహారం బయటపడింది. ఇప్పటివరకు దేశంలోని 8 విమానాశ్రయాలను పబ్లిక్ – ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో లీజుకు ఇచ్చారు.దీంతో ఇప్పుడీ ఈ వ్యవహారం మళ్లీ ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై భగ్గుమంటున్న ప్రతిపక్షాలు ఈ మూడు విమానాశ్రయాల ప్రైవేటీకరణపై విరుచుకుపడే అవకాశం ఉందని అంటున్నారు.మరోవైపు జగన్ ప్రభుత్వం పీపీపీ విధానంలో నిర్మిస్తున్న భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు 2203 ఎకరాలు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 2160.47 ఎకరాలు సేకరించినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ రాజ్యసభలో తెలిపారు. ఈ విమానాశ్రయ నిర్మాణానికి రూ.2500 కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు వెల్లడించారు.కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం విమానాశ్రయం తొలి దశ పూర్తయితే ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల అవసరాలను భోగాపురం విమానాశ్రయం తీర్చగలుగుతుందన్నారు. 2022 శీతాకాల షెడ్యూల్ ప్రకారం... ఆంధ్రప్రదేశ్లోని మూడు అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి 15 అంతర్జాతీయ విమానాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.