YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హిజాబ్ నుంచి హలాల్ వరకు

హిజాబ్ నుంచి హలాల్ వరకు

బెంగళూరు, డిసెంబర్ 21, 
కర్ణాటకలో మొదలైన 'హిజాబ్' వివాదం దేశవ్యాప్తంగా ఎంత దుమారం రేపిందో.. మనం చూశాం. తాజాగా అదే రాష్ట్రంలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అదే 'హలాల్'. అసలు ఈ 'హలాల్‌' మాంసంపై నిషేధం విధించేందుకు భాజపా ఎందుకు ప్రయత్నిస్తోంది? అసలు హలాల్ అంటే అర్థమేంటి? హలాల్ మాంసం తింటే తప్పేంటి? వీటన్నింటి గురించి తెలుసుకుందాంహలాల్ అనే పదం.. అరబ్బీ నుంచి వచ్చింది. హలాల్ అంటే ధర్మబద్ధమైనది లేదా అనుమతించదగినదని అర్థం. ప్రపంచంలోని దాదాపు ముస్లింలు అంతా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ హలాల్ ఆహార పదార్థాల వాణిజ్య మార్కెట్టు ప్రపంచవ్యాప్తంగా 580 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉందని అంచనా. హలాల్‌కు వ్యతిరేక పదం హరామ్. దీనికి నిషేధించినది, అధర్మమైనది, అనైతికమైనది అని అర్థం ఉంది. ఆహార పదార్థాలకు "హలాల్ సర్టిఫికేట్" ఇచ్చే సంప్రదాయం ముస్లింలలో ఉంది. జంతువుల మాంసాలను, హలాల్ చేసిన తరువాత మాత్రమే తినాలని వారు నమ్ముతారు.హలాల్‌ అనేది జంతువును వధించేందుకు వాడే ఓ పద్ధతి. ఇందులో మొదట జంతువుల మెడ దగ్గర నరాన్ని కోసి రక్తం బయటకు వచ్చేలా చూస్తారు. ఆ రక్తం జంతువు శరీరంలోనే ఉండిపోతే.. దాన్ని తినడంతో మనకు జబ్బులు వస్తాయని మహమ్మద్ ప్రవక్త చెప్పారు. రక్తం మొత్తం బయటకు వెళ్లిపోతే, ఆ మాంసాన్ని తిన్న తర్వాత మనకు ఏమీ కాదని వారు నమ్ముతారు. ఈ పద్ధతిని జబీహా అని పిలుస్తారు.హలాల్ కోసం మొదట జంతువును నేలపై పడుకోబెడతారు. "బిస్మిల్లాహి అల్లాహు అక్బర్" అని చెబుతూ జబీహా చేస్తారు. తల నుంచి శరీరం వేరుకాకుండా జాగ్రత్త పడుతూ మెడ దగ్గర కోస్తారు. అలా రక్తాన్ని బయటకు తీసేస్తారు. ఈ మొత్తం విధానాన్ని హలాల్ అని పిలుస్తారు. ముస్లిం మతం విశ్వాసాల ప్రకారం.. హలాల్ మాంసం తప్ప మరే ఇతర పద్ధతిలో వధించిన జంతువు మాంసాన్ని వాళ్లు తినరు.ఇక ఝాట్కా పద్ధతి రెండోది. ఈ విధానంలో జంతువు తల, మొండాన్ని వేరు చేస్తారు. ఇలా చేయడం ద్వారా వాటికి ఎక్కువ నొప్పి లేకుండా సులభంగా ప్రాణం పోతుంది.ఇప్పటివరకు దీనిపై పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హలాల్ మాంసానికి వ్యతిరేకంగా బిల్లు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్ 19 నుంచి మొదలైన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రతిపాదించాలని యోచిస్తోంది. ఈ బిల్లు ద్వారా హలాల్ మాంసాన్ని నిషేధిస్తామని చెబుతోంది. దేశంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కాకుండా మరే ఇతర సంస్థకు 'ఫుడ్ సర్టిఫికేషన్' ఇచ్చేందుకు హక్కు లేకుండా చర్యలు తీసుకోవాలని భాజపా ఎమ్మెల్యే ఎన్. రవికుమార్ డిమాండ్ చేస్తున్నారు. హలాల్ అంశంపై అసెంబ్లీలో ఆయనే ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై అసెంబ్లీలో భాజపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. గత సెషన్‌లో యాంటీ కన్వర్షన్‌ బిల్‌పై కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇప్పుడు కూడా అదే వేడి కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే లోపు యాంటీ హలాల్ చట్టాన్ని తీసుకురావాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా హిందువుల ఓట్లను కొల్లగొట్టాలని భాజపా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.కర్ణాటకలో ఉగాది పండుగ సమయంలోనే హలాల్ మాంసంపై వివాదం మొదలైంది. హిందూ జాగృతి సమితి, శ్రీరామసేన, భజరంగ్ దళ్ సహా పలు హిందూ సంస్థలు వీధుల్లోకి వచ్చి అప్పుడు నిరసన వ్యక్తం చేశాయి.
ఇప్పటికే హిజాబ్ వివాదం.. దేశవ్యాప్తంగా ఎంత దుమారం రేపిందో అందరూ చూశారు. ఇక ఈ హలాల్ వివాదం కారణంగా ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.

Related Posts