బీజింగ్, డిసెంబర్ 21,
చైనాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లోని పరిస్థితులపై నిశితంగా అప్రమత్తంగా ఉండాలని భారతీయ ఆరోగ్య నిపుణులు ప్రజలను హెచ్చరించారు. అయితే దేశం అప్రమత్తంగా ఉన్నందున భయపడాల్సిన పని లేదని వారు తెలిపారు. కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ఎన్‌టీఏజీఐ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా మంగళవారం కోవిడ్‌పై సమీక్షిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చైనా పరిస్థితిపై మనం నిశితంగా నిఘా ఉంచడం తప్పనిసరి. కానీ దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. దేశ ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉన్నందున ఆందోళన చెందనవసరం లేదు. కోవిడ్ వైరస్ కొత్త సబ్-వేరియంట్ల విషయంలో దేశం తగిన చర్య తీసుకోగలద’’ని అరోరా విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘మేము మురుగువాడల ప్రజల నుంచి అంతర్జాతీయ విమానాశ్రయాలకు వచ్చే వారి వరకు కూడా నిఘా చేస్తున్నాము. కొత్త సబ్-వేరియంట్ లేదా ఏదైనా ఉంటే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.ఇక భారత్‌కు సంబంధించినంత వరకు ఇక్కడ రోగనిరోధక శక్తి కలిగినవారే ఎక్కువగా ఉన్నారు. అదనంగా ప్రభావవంతమైన టీకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదు’’ అని డాక్టర్ అరోరా తెలిపారు. అయితే జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికా, చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నందున దేశంలోని పరిస్థితులపై సమీక్షించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అనుకుంటున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని COVID-19 పరిస్థితిని కేంద్ర మంత్రి సమీక్షిస్తారు.కాగా, ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని, వారానికి ఏకంగా 35 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే దేశంలో వారానికి 1200 కేసులు నమోదవుతున్నట్లు ఈ నేపథ్యంలోనే ‘ కోవిడ్ కేసులను జినోమ్ సీక్వెన్సింగ్ చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కరోనా మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే రెండేళ్ల నాటి పరిస్థితులు తప్పవని రాష్ట్రాలను హెచ్చరించిన’ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.