కాకినాడ, డిసెంబర్ 23,
ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ అంబేడ్కర్ జిల్లాలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓడలరేవు, కొమరగిరిపట్నం తీర ప్రాంతాల్లో ఎంతో అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. ఇక బీచ్‌ను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులకు తీరం వెంబడి చనిపోయి పడి ఉన్న తాబేళ్ల కళేబరాలు దర్శనమిస్తున్నాయి. సాధారణంగా జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లోని సముద్ర జలాల్లో అధికంగా కనిపించే ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్లు.. సంతానోత్పత్తి కోసం గుడ్లు పెట్టేందుకు బంగాళాఖాతం సముద్ర తీరానికి చేరుకుంటాయి. రాత్రి సమయాల్లో తీరంలోని ఇసుక తిన్నెల్లో గుడ్లు పెట్టి.. ఆ తర్వాత ఇసుకతో వాటిని కప్పుతాయి. అనంతరం మళ్ళీ తిరిగి సముద్ర జలాల్లోకి వెళ్లిపోతాయి.నవంబర్ చివరి వారం నుంచి జనవరి వరకు ఇవి తీరంలో గుడ్లు పెట్టే సమయం కావడంతో అటవీ శాఖ అధికారులు వీటికి రక్షణ కల్పిస్తారు. అయితే మత్స్యకారుల నిషేధిత వలలు ఈ తాబేళ్లకు యమపాశాలుగా మారుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆలివ్ రిడ్లే తాబేళ్లు మృత్యువాత పడుతుండటంతో వన్యప్రాణ, జంతు రక్షకులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ అరుదైన తాబేళ్ల సంతతి నశించిపోకుండా అటవీ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.ఇదిలా ఉంటే.. అరుదైన ఉభయచర జీవుల్లో తాబేళ్లు కూడా ఒకటి. వీటిల్లో అనేక రకాల జాతులున్నాయి. అందులో ఆలివ్ రిడ్లే తాబేళ్లకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి రెండడుగుల పొడవు, సుమారు 500 కేజీల బరువు ఉంటాయి. ఈ తాబేళ్లు గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణించి.. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తీరాలకు సముద్ర మార్గంలో వలస వస్తూంటాయి.