కర్నూలు, డిసెంబర్ 23,
కొత్త పన్ను వసూలు కోసం కర్నూలు కార్పొరేషన్ వింత పోకడలు అనుసరిస్తోంది. చెత్త పన్ను కట్టకపోతే పింఛన్ రాదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవనీ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అవేమీ లేని వారికి కుళాయి కనెక్షన్ కట్ చేస్తాం అంటూ బెదిరిస్తున్నారు. చెత్త పన్ను వసూలు చేసేందుకు తాజాగా నగరంలోని శ్రీరాం నగర్‌కు చెందిన ఓ వ్యక్తి వద్దకు వలంటీర్, శానిటరీ సెక్రటరీ వెళ్లారు. తాను చెత్త పన్ను కట్టనని ఆ వ్యక్తి చెప్పడంతో వారు శానిటరీ ఇన్స్‌పెక్టర్‌కు ఫోన్ చేశారు. ' చెత్త పన్ను కట్టాలని, కట్టకపోతే తాము కుళాయి కనెక్షన్ కట్ చేస్తామని' అతను బెదిరింపులకు పాల్పడ్డారు. నగరంలో ఇలా ఒక్క వ్యక్తినే కాదు చెత్తపన్ను కట్టని వారందరినీ ఏదో ఒక విధంగా కార్పొరేషన్ సిబ్బంది బెదిరిస్తూనే ఉన్నారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రతి ఇంటికీ నెలకు రూ.60 చొప్పున చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. దీనిపై మొదటి నుంచి ప్రజలు, ప్రజాసంఘాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ ముట్టడి కూడా చేపట్టారు. అయినా కార్పొరేషన్ అధికారులు పన్ను వసూలు విషయంలో వెనక్కు తగ్గడం లేదు. ఎలాగైనా చెత్త పన్ను వసూలు చేయాలని బెదిరింపు మార్గాన్ని కార్పొరేషన్ సిబ్బంది ఎంచుకున్నారు. చెత్త పన్ను కట్టకపోతే పింఛన్ రాదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవనీ, కుళాయి కనెక్షన్ కట్ చేస్తాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. చెత్త పన్ను కట్టలేదని ఓ దుకాణ సముదాయం ముందు గతంలో మున్సిపల్ సిబ్బంది చెత్తను వేశారు. అలాగే నంద్యాల విసి కాలనీలో నివసిస్తున్న దంపతులకు విడివిడిగా చెత్త పన్ను విధిస్తూ నోటీసులు ఇచ్చారు. భర్త పేరిట రూ.120, భార్య పేరిట రూ.60 కట్టాలని అందులో పేర్కొన్నారు. చెత్త పన్ను కట్టకపోతే పెన్షన్ నుంచి మినహాయించుకుని ఇస్తామని చెబుతున్నారని, ఇలా చేయడం వల్ల మాకు మందులకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని కర్నూలులోని బంగారుపేట చెందిన మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు. 'కార్పొరేషన్ పరిధిలో చాలా మంది చెత్త పన్ను చెల్లించడం లేదు. ఒకసారి కడితే అలవాటు పడతారని, ఒకరిని చూసి మరొకరు పన్ను కడతారని సిబ్బంది అలా చెబుతున్నారని' కర్నూలు కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ రమాదేవి చెప్పడం కొసమెరుపు.కూలీ చేసి బతికేటోళ్లం. రెక్కాడితే గానీ డొక్కాడకుంది. నెలకు రూ.60 చెత్త పన్ను కట్టాలని అంటున్నారు. మేం కట్టలేం. వలంటీర్లు వచ్చి చెత్త పన్ను కట్టాల్సిందే, లేకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రావని చెబుతున్నారు. ప్రభుత్వం ఓ పక్క సంక్షేమ పథకాలు అందిస్తూనే మళ్లీ మా ద్వారా పన్నులు వసూలు చేయడం సరికాదని వాపోతున్నారు