తెలుగు సినీరంగంలో తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ(87) శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ లోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 1935 జులై 25న సీతారామమ్మ, లక్ష్మీనారాయణ దంపతులకు కైకాల కృష్ణ జిల్లా గుడ్లవల్లేరు లోని కౌతరం గ్రామంలో జన్మించారు. తొలి తెలుగు టాకీ సినిమా భక్తప్రహ్లాద 1931 లో రిలీజ్ అయింది. కైకాల ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేశారు. సినిమాల మీద ఆసక్తితో మద్రాసు చేరుకున్న ఆయన మొదటి సినిమా ‘సిపాయి కూతురు. ఆ చిత్రం 1959లో విడుదలైంది. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో కైకాల కు వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్నారు.
కైకాల సత్యనారాయణ 60 ఏళ్ల సినీ జర్నీలో మొత్తం 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హీరోగా, విలన్, హాస్య, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా అనేక పాత్రల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా యుముడి పాత్రతో ఆయన ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు. కైకాల సత్య నారాయణ మరణ వార్త తెలిసి టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.