గుంటూరు, డిసెంబర్ 26,
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తెలుగు తమ్ముళ్లు చడీచప్పుడు కాకుండా కూర్చుంటున్నారు. నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు ఓ రేంజ్‌లో హల్చల్ చేసిన నాయకులు సైతం నోరు మెదపడం లేదు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో టీడీపీ మూడు నాలుగు వర్గాలుగా చీలి.. సీటు నాదంటే నాది.. నాకంటే నాకేనని తిట్టి కొట్టుకున్న వాళ్లు ఇప్పుడు గాయబ్ అయ్యారు. సడన్‌గా అందరూ సైలెంట్ అయిపోయారు. దీనికి కారణం నియోజకవర్గంలో జనసేన చేస్తున్న కార్యక్రమాల హడావిడేనని చెవులు కొరుకుంటున్నారు సత్తెనపల్లి ప్రాంత ప్రజలు.పవన్ కల్యాణ్ సత్తెనపల్లి పర్యటన, దానికి ముందు జనసేన నేతల హడావుడి ఒక ఎత్తు అయితే.. సాక్షాత్తూ మంత్రి అంబటి రాంబాబు ఓ బాధిత కుటుంబాన్ని లంచం అడిగారంటూ రేగిన వివాదంలో టీడీపీ ఎక్కడా కనిపించలేదు. తమ పార్టీని, అధినేతను పూచిక పుల్లలా చూసే అంబటి దొరికితే ఓ రేంజ్‌లో ఆటాడుకోవాల్సిన టీడీపీ గప్‌చుప్ అయ్యింది. అదే టైమ్‌లో జనసేన నాయకులు ఒక్కసారిగా స్పీడ్ పెంచారు. ఈ విషయంలో కనీసం స్పందించని టిడిపి నాయకులు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.ఇలాంటి సంఘటన వేరే నియోజకవర్గంలో జరిగితే వ్యవహారం అంతా మాదే అని బరిలోకి దిగే టీడీపీ నాయకులు సత్తెనపల్లిలో ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది అసలు ప్రశ్న. అయితే ఇప్పటికే టిడిపిలో ఉన్న వర్గవిభేదాలతో సీటు ఎవరికి వస్తుందో క్లారిటీ లేదు. ఇప్పుడు అన్నిటికి మించి జనసేన ఈ ప్రాంతంలో పాగా వేయాలని ప్లాన్ చేయడం.. పొత్తు కూడా ఉండొచ్చనే అంచనాలతో.. కచ్చితంగా ఇక్కడ జనసేనకు సీటు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో తాము ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుని కార్యక్రమాలు చేసినా పార్టీలో గుర్తింపు రాదు.. కనీసం ఇంచార్జి పదవి కూడా రాదు.. భవిష్యత్తులో సీటు వస్తుందన్న ఆలోచన లేదని నిట్టూరుస్తున్నారట. అలాంటప్పుడు ఉద్యమాలు, కార్యక్రమాలు చేయడం, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకనే ఆలోచనలో టిడిపి నాయకులు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.అంతేకాదు.. అధికారపార్టీ నేతల మీద ఆరోపణలు చేసి అనవసరంగా వాళ్లకి టార్గెట్ కావడం ఎందుకు అనే ఆలోచన నిన్నటి వరకు సీటు అడిగిన వాళ్లలో ఉందట. లేదంటే ఎప్పటినుంచో పోరాటాలు చేస్తున్న టిడిపిని కాదని బాధిత కుటుంబం జనసేన నాయకులను కలవడం ఏంటి? అక్కడి నుంచి పవన్‌తో భేటీ.. జనసేన ఉద్యమం చేయటం రాజకీయ పొత్తు వ్యవహారంగానే కనిపిస్తోంది. ఈ అంశంలో ఎక్కడా టిడిపి కనీసం వేలు పెట్టిన పరిస్థితి కూడా లేదు. సాధారణంగా నియోజకవర్గంలో ఓ మహిళకు, లేదా ఓ కుటుంబానికి అన్యాయం జరిగిందని సమాచారం వస్తే వెంటనే దాన్ని తమ క్రెడిట్‌గా చెప్పుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తాయి. అలాంటి ప్రయత్నం కూడా ఇక్కడ టిడిపి నాయకులు చేయలేదు. దీనిని బట్టి స్థానికంగా టిడిపి, జనసేన నాయకులు ముందే ఓ ఒప్పందానికి వచ్చారా అనే అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలో ఏం జరిగినా జనసేన నాయకులు స్పందించినట్టుగా టిడిపి నాయకులు స్పందించడం లేదని టాక్ వినిపిస్తోంది. పొత్తుల మీద టీడీపీ, JSPలు క్లారిటీ ఇంతవరకు ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే పవన్ కల్యాణ్‌ను టీడీపీ అధినేత కలిశారో అప్పటి నుంచే క్షేత్రస్థాయిలో.. ఇది మీకు అది మాకు అంటూ అనధికార పంపకాలు చేసుకుంటున్నారట. అలాంటి పరిస్థితుల్లో సత్తెనపల్లి నియోజకవర్గాన్ని జనసేన పోటీ చేయడానికి అనువుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే జనసేన పోటీ చేసేటప్పుడు.. మనకెందుకు వచ్చిన గోల అనుకుంటూ టిడిపి నేతలు చల్లగా జారుకుంటున్నారట. భవిష్యత్తులో నిజంగా పొత్తులు కుదురుతాయో లేదో, జనసేనకు ఇస్తారో లేదో తెలియదు గాని, ప్రస్తుతం టిడిపి నాయకుల వైఖరితో ప్రజల్లో మాత్రం పార్టీ పలచనవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. పక్కపార్టీతో పొత్తుల వ్యవహారం పక్కన పెట్టి.. లెక్కలు తేలే వరకు పోరాటాలు చేయాల్సిన నాయకులు ముందే కాడి వదిలేసి సర్దుకోవటం ఏంటని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అనే నానుడికి ఇదే ఉదాహరణ అంటూ చెవులు కోరుకుంటున్నారు సత్తెనపల్లి ప్రజలు.