విజయవాడ, డిసెంబర్ 26,
బాలకృష్ణ, పవన్ కల్యాణ్.. ఇద్దరూ రాజకీయ, సినీ రంగాలలో బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉన్న వారే. బాలకృష్ణ తెలుగుదేశం సీనియర్ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే కాగా పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధినేత. ఇరువురూ రాజకీయ, సినీ రంగాలలో బిజీగా ఉన్నవారే. బాలకృష్ణ సినిమాలూ, ఆన్ స్టాపబుల్ అనేషో, రాజకీయాలలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా రాజకీయాలు, వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అటువంటి వీరిరువురూ భేటీ అయ్యారంటే.. అది సంచలనమే. సర్వత్రా ఆసక్తి కలిగించే విషయమే. అదే జరిగింది.బాలకృష్ణ సినిమా షూటింగ్ జరుగుతున్న చోటుకు పవన్ కల్యాణ్ వచ్చారు. బాలకృష్ణతో దాదాపు అరగంట సేపు భేటీ అయ్యారు. పలు అంశాలపై ఇరువురి మధ్యా చర్చ జరిగింది. బాలకృష్ణ ఓ పక్క అన్ స్టాపబుల్ షోతో, సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో రాబోతున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో, పాలిటిక్స్ తో బిజీగా ఉన్నాడు. వీరిద్దరూ కలవడం అనేది చాలా రేర్. అన్‌స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ వస్తారని వార్త ఇటీవల బాగా వినిపిస్తుంది. అయితే అందులో నిజమెంతో తెలియదు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ బాలయ్యలు భేటీ అయ్యారు.వీరి భేటీ సినీ, రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టించింది. వీరి భేటీ వెనుక కారణాలపై విస్తృత చర్చ జరుగుతోంది. వీరసింహారెడ్డి షూట్ లో పవన్ కళ్యాణ్ బాలయ్యని, చిత్ర యూనిట్ ని కలిసి కాసేపు మాట్లాడారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు. వీరసింహారెడ్డి సినిమాలోని సాంగ్ షూట్ జరుగుతున్న సమయంలో పవన్ వెళ్లారు. బాలయ్య, పవన్ ల భేటీ కి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. మామూలుగా సినిమా సెట్ లో వీరు భేటీ అవ్వడమే ఇంత సెన్సేషన్ సృష్టించిందంటే.. నిజంగానే బాలయ్య ఆన్ స్టాపబుల్ షోలో పవన్ కల్యాణ్ కనిపిస్తే మరెంత సెన్సేషన్ అవుతుందోనన్న చర్చ అటు రాజకీయ వర్గాలు, ఇటు సినిమా వర్గాలలోనూ జోరందుకుంది.వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనవ్వను అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఏపీలో కొత్త రాజకీయ సమీకారణాలపై చర్చకు తెరలేపిన సంగతి విదితమే. ఇప్పుడు బాలయ్య తో పవన్ బేటీ ఏపీ రాజకీయాలలో రానున్న మార్పులకు సంకేతమా అన్న చర్చ జోరందుకుంది. ఎందుకంటే పవన్ కల్యాణ్, బాలకృష్ణలు సినీ హీరోలు మాత్రమే కాదు.. రాజకీయ నాయకులు కూడా. ఇద్దరూ చెరో పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధినేత కాగా, బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, హిందుపురం ఎమ్మెల్యే. అంతే కాకుండా తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమారుడు, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి స్వయానా వియ్యంకుడు. ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మామ, మేనమామ కూడా. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్, బాలకృష్ణల భేటీ రాజకీయాలలో కొత్త సమీకరణాల చర్చను తెరపైకి తీసుకు వచ్చింది.