తిరుపతి, డిసెంబర్ 28,
సాధారణంగా ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మైండ్సెట్ వేరు. అప్పటికప్పుడే ఆయన హామీ ఇస్తారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేస్తారు. పెద్దగా సమయం కూడా తీసుకోరు. ప్రధానంగా పార్టీ కోసం పనిచేసి మరణించిన వారి కుటుంబాల పట్ల జగన్ అస్సలు టైం తీసుకోరు. కానీ ఒక్క విషయంలో జగన్ ఆలోచనలో పడ్డారని అనిపిస్తంది. ఇంతవరకూ ఆ కుటుంబానికి ఎటువంటి పదవి ఇవ్వకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. జగన్ మదిలో ఏముంది? జగన్ ఆ కుటుంబానికి వేరే విధంగా న్యాయం చేస్తారా? లేక పూర్తిగా పక్కన పెడతారా? అన్న టాక్ పార్టీలో వినపడుతుంది.తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మరణించారు. ఆయన కరోనా కారణంగా మరణించారు. బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి జగన్ హామీ ఇచ్చారు. తిరుపతి ఎంపీ టిక్కెట్ ఆ కుటుంబానికి ఇవ్వకుండా డాక్టర్ గురుమూర్తికి ఇచ్చినా బల్లి దుర్గాప్రసాద్ తనయుడు కల్యాణ్ చక్రవర్తికి మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కొంత ఆలస్యమయినా ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయిన వెంటనే కల్యాణ చక్రవర్తిని ఎమ్మెల్సీని చేశారు. విజయవాడకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్నీసా 2021 డిసెంబరు నెలలో గుండెపోటుతో మరణించారు. అయితే వెంటనే ఆమె కుమారుడు రుహుల్లాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. చనిపోయిన తర్వాత అక్కడకు చేరుకుని భౌతిక కాయానికి నివాళులర్పించిన జగన్ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. చెప్పినట్లుగానే వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.అలాగే 2020 డిసెంబరు నెలలో వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మరణించారు. వెంటనే జగన్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చినట్లుగానే ఆయన కుమారుడు భగీరధ్రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంలో పెద్దగా ఆలస్యం చేయలేదు. కానీ దురదృష్టవశాత్తూ చల్లా భగీరధ్రెడ్డి కూడా మరణించారు. అయితే ఆయన కుటుంబానికి జగన్ ఎలాంటి హామీ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. చల్లా భగీరధ్రెడ్డి సతీమణి శ్రీలక్ష్మి రాజకీయాల్లోనే ఉన్నారు. ప్రస్తుతం అవుకు ఎంపీటీసీగా ఆమె కొనసాగుతున్నారు. బనగానపల్లెలో చల్లా కుటుంబానికి ప్రత్యేకత ఉంది. వర్గమూ ఉంది. కానీ జగన్ మాత్రం ఆ కుటుంబానికి ఎలాంటి హామీని ఇంతవరకూ ఇవ్వలేదంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో చల్లా శ్రీలక్ష్మికి బనగానపల్లె ఎమ్మెల్యే సీటు ఇవ్వాలన్న యోచనలో ఉన్నారని కొందరు అంటున్నారు. మామ, భర్తను కోల్పోయిన కుటుంబానికి ఆసరాగా నిలవాలని జగన్ ఎమ్మెల్సీ పదవి విషయంలో ఆ కుటుంబానికి హామీ ఇవ్వలేదంటున్నారు. అందుకే నవంబరు 2వ తేదీన చల్లా భగీరథ్రెడ్డి మరణించినా ఇప్పటి వరకూ ఎమ్మెల్సీ పదవి విషయంలో మాత్రం జగన్ పెదవి విప్పలేదంటున్నారు. బనగానపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుటుంబంలో ఒకరికి ఇచ్చే ఛాన్స్ లేకపోలేదని చెబుతున్నారు. అలాగే మరో నేత బిజ్జం పార్థసారధి రెడ్డి పేరు కూడా బనగానపల్లె టిక్కెట్ రేసులో వినపడుతుంది. అందుకే చల్లా భగీరథ్రెడ్డి కుటుంబానికి ఇంతవరకూ ఎమ్మెల్సీ పదవిని ప్రకటించడం లేదన్న చర్చ పార్టీలో జరుగుతుంది.