విజయవాడ, డిసెంబర్ 31,
వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి చెందిన 151 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దాదాపు 60 నుంచి 70 మందిని పక్కన పెట్టేయడం దాదాపు ఖరారైంది. చంద్రబాబులా జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే వ్యక్తి కాదు. సర్వేల్లోనూ.. ప్రజాభిమానం పొందే విషయంలో వెనుకబడి ఉన్న ఎమ్మెల్యేలను నిర్దాక్షణ్యంగా తప్పించేసి వారి స్థానాల్లో కొత్త వ్యక్తులకు సీట్లు ఇవ్వనున్నారు. వచ్చే ఎన్నికలు జగన్కు చావోరేవో లాంటివి. మరోసారి కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల్లో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మరోసారి గెలిపించుకోవడం కష్టం అన్న అభిప్రాయానికి జగన్ వచ్చేసారు. అందుకే ప్రజల్లో అభిమానం లేని ఎమ్మెల్యేలను పక్కనపెట్టి వారి స్థానాల్లో కొత్త వ్యక్తులకు టిక్కెట్ ఇస్తే అన్ని విధాల శ్రేయస్కరం అని... గెలుపు సులువు అవుతుందని జగన్ లెక్కలేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా చింతలపూడి రిజర్వుడు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే వీఆర్. ఎలీజాకు కూడా జగన్ షాక్ ఇవ్వటం దాదాపు ఖరారు అయింది. గత ఎన్నికల్లో గెలిచిన ఏడాది నుంచే ఎలీజాకు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీథర్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. చింతలపూడి శ్రీథర్ సొంత నియోజకవర్గం. వాళ్ల తండ్రి కోటగిరి విధ్యాధరరావు ఇక్కడ నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో బలమైన అనుచరగణం ఉంది. ఎన్నోసార్లు జిల్లా పార్టీ నాయకత్వం నుంచి, పార్టీ కీలక నేతల మధ్య కూడా నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే విబేధాలపై ఫిర్యాదులు,, పంచాయితీలు నడిచాయి. ఎలీజా ఎవ్వరి మాట వినకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గం వారిని ప్రత్యేకంగా పోటీ పెట్టించారు. అటు ఎంపీ వర్గం గత ఎన్నికలకు ముందు నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తిస్తోంది. కొద్ది నెలల క్రితం గోదావరి జిల్లాల పార్టీ పరిశీలకుడిగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి సైతం ఎంపీ గారికి టిక్కెట్ ఖరారైంది. మీ పనితీరుతో పాటు పార్టీ నాయకులతో మీ సమన్వయాన్ని బట్టే మీకు టిక్కెట్ ఉంటుందని ఎలీజాకు నేరుగానే చెప్పేశారు. అయినా కూడా ఎమ్మెల్యే తీరు మారలేదన్న నివేదికలు జగన్ దగ్గరకు చేరిపోయాయి. ఎలీజా ఇప్పటికీ కొన్ని వర్గాలతో పాటు కొంతమందినే కలుపుకుని వెళుతున్నారన్న ఆరోపణలు ఉండగా... పైకి ఈ అంశాలపై చాలా ఫిర్యాదులు కూడా వెళ్లిపోయాయి. రీసెంట్గా పార్టీ కీలక నేతలతో పాటు జగన్ చేయించిన రెండు సర్వేల్లో చింతలపూడిలో వైసీపీ చాలా బలంగా ఉంది. టీడీపీలో ఉన్న నాయకత్వ సమస్య, లుకలుకలతో పాటు అంతర్గత విబేధాలు అన్నీ పార్టీకి కలిసి వచ్చేలా ఉన్నాయి. ఎన్ని కష్ట పరిస్థితులు వచ్చినా కూడా టీడీపీ కంటే వైసీపీకే ఇక్కడ 4 శాతం ఎడ్జ్ ఉందన్నది క్లీయర్ కట్గా తేలిపోయిందట. అయితే ఎలీజాకే సీటు ఇస్తే మాత్రం పార్టీకి చాలా వర్గాలు దూరం కావడంతో పాటు పోల్ మేనేజ్మెంట్లో కీలకంగా పనిచేసే వర్గాలు అన్నీ దూరమవుతాయని.. చింతలపూడి సీటు చేజేతులా కోల్పోవాల్సి వస్తుందని తేలిందట. ఇద్దరిలో ఒకరు... ఎలీజాను తప్పించేసే విషయంలో సందేహాలే లేవు. అయితే ఆయన ప్లేసులో టిక్కెట్ ఎవరికి ఇస్తారన్న దానిపై రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. నియోజకవర్గంలోని కామవరపుకోట మండలానికే చెందిన రవాణా శాఖ అధికారి విజయరాజు పేరు వినిపిస్తోంది. ఎంపీ వర్గంతో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు ఆయనకు వియ్యంకుడు కావడంతో పాటు ఎంపీ వర్గంతో ఎప్పటి నుంచో టచ్లో ఉండడం, స్థానికుడు కావడం.. బలమైన పరిచయాలు, ఆర్థిక అండదండలు ఆయనకు ప్లస్ కానున్నాయి. చాపకింద నీరులా విజయరాజు తన పని తాను చేసుకుపోతున్నారు. గోపాలపురం అనుకున్నా... అయితే ఇప్పుడు అనూహ్యంగా ఏపీ సీఐడీ చీఫ్ సునీల్కుమార్ పేరు కూడా లైన్లోకి వచ్చేసింది. సునీల్ కుమార్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న టాక్ ఏడాదిన్నర నుంచే వినిపిస్తోంది. పైగా సీఎం జగన్కు అత్యంత ఇష్టుడు. ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన పేరు నిన్నటి వరకు గోపాలపురం రేసులో వినిపించినా.. ఇప్పుడు చింతలపూడి నుంచే తెరమీదకు వస్తోంది. సునీల్ కుమార్ కూడా ఇటీవల నియోజకవర్గంలో జరిగిన కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అవ్వడంతో పాటు పార్టీ పరిస్థితిపై కూపీ లాగుతున్నట్టు టాక్ ? ఎలీజాకు అయితే నూటికి నూరు శాతం సీటు లేదు. మరి చింతలపూడి కొత్త వైసీపీ క్యాండెట్ ఎవరు అవుతారన్న దానిపై జగన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.