గుంటూరు, డిసెంబర్ 31,
వైనాట్ 175. వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ నినాదం. మారుతున్న సమీకరణాలతో అమరావతి పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అందులో మంగళగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు పోటీ ఖాయంగా కనిపిస్తోంది. అక్కడ వైసీపీ బీసీ కార్డుతో లోకేశ్ ను ఎదుర్కొనేందుకు సిద్దమైంది. మరో నియోజకవర్గం తాడికొండ. అక్కడ పరిస్థితి ఇప్పుడు వైసీపీ ముఖ్య నేతల కే సవాల్ గా మారుతోంది. కొంత కాలంగా తాడికొండ వైసీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా పార్టీ ఇంఛార్జ్ ల సమక్షంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు వినిపిస్తున్నాయి.అమరావతి పరిధిలోని తాడికొండ, తుళ్లూరు మండలాల వైసీపీ నేతలతో పార్టీ ముఖ్యులు సమావేశమయ్యారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పార్టీ నేతల నుంచి క్షేత్ర స్థాయి సమాచారం పైన ఆరా తీసారు. స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు ఎమ్మెల్యే శ్రీదేవి పైన నిరసన వ్యక్తం చేసారు. ఆ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడే ప్రయత్నం చేయగా కొందరు వ్యతిరేక నినాదాలు చేసారు. మాట్లాడుతుంటే అడ్డుకున్నారు. మరి కొందరు ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచారు. కొద్ది రోజుల క్రితమే నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన కత్తెర సురేష్ తాడికొండ లో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసారు. సురేష్ ను ఎమ్మెల్యే శ్రీదేవి మద్దతు దారులు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.గతంలో ఎమ్మెల్యే డొక్క మాణిక్య వరప్రసాద్ ను తాడికొండ సమన్వయకర్తగా నియమించిన సమయంలోనూ ఎమ్మెల్యే వర్గీయుల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. కొద్ది రోజుల పాటుగా డొక్కకు నియోకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించటం పైన నిరసనలు కొనసాగించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలతో ఎమ్మెల్యే శ్రీదేవి సమావేశం తరువాత నిరసనలు నిలిచిపోయాయి. అయితే, తాజాగా గడప గడపకు ప్రభుత్వం వర్క్ షాప్ నిర్వహించిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల పని తీరు గురించి ప్రస్తావించారు. వెనుకబడిన వారి పేర్లను ప్రస్తావించారు. ఆ జాబితాలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఉన్నారు. మార్చి లోగా పని తీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఇప్పుడు తాడికొండలో సొంత పార్టీ కేడర్ లోనే నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అమరావతి పరిధిలో నియోజకవర్గాలు ప్రతిష్ఠాత్మకంగా మారిన వేళ..తాడికొండలో ఇప్పుడు వైసీపీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది చూడాలి.