అనంతపురం, డిసెంబర్ 31,
వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం కావడంతోపాటు అభ్యర్థుల ఎంపిక కూడా పార్టీ విజయావకాశాలను ప్రభావితం చేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యూహాలు రచిస్తున్నారు. ఒకే కుటుంబంలో పలువురికి టికెట్లు నిరాకరించడంతోపాటు సరిగా పనిచేయనివారికి కూడా మొండిచెయ్యే చూపిస్తున్నారు.గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ నేతలు పలువురు తమ వారసులను నియోజకవర్గాల్లో రంగంలోకి దించారు. అయితే వారంతా ఓటమిపాలయ్యారు. మరోసారి వారిచేత పోటీచేయించాలనుకుంటున్నప్పటికీ చంద్రబాబు ఒప్పుకోవడంలేదు. కానీ కోవూరు నియోజకవర్గం నుంచి పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డికి మాత్రం టికెట్ ఖరారు చేయబోతున్నారు. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరులు తమ వారసులు జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డిని బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో అనంతపురం ఎంపీ సీటు నుంచి దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి పోటీచేసి ఓటమిపాలయ్యారు. అలాగే తాడిపత్రి నుంచి ప్రభాకర్ రెడ్డి వారసుడు అస్మిత్ రెడ్డి కూడా పరాజయం పాలయ్యారు.ఎన్నికలైన తర్వాత జేసీ పవన్ రెడ్డి ఎక్కువగా హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు. చుట్టంచూపుగా అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చి వెళుతున్నారు. అలాగే అస్మిత్ రెడ్డి కూడా అప్పుడప్పుడు తాడిపత్రికి వచ్చిపోతుండటంతోపాటు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలను కూడా నిర్వహించడంలేదు. దీంతో వీరిని నమ్మకొనివున్న పార్టీ శ్రేణులు పునరాలోచనలో పడ్డాయి. కార్యకర్తలు జారిపోయే ప్రమాదం ఉందని భావిస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో వారసులను పక్కనపెట్టి తామే నేరుగా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. అనంతపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి నుంచి ప్రభాకర్ రెడ్డి పోటీచేయాలని నిర్ణయించారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఇప్పటికే ఈసారి ఎన్నికల్లో మీరు పోటీచేయాల్సిందేనని, వారసులను పక్కన పెట్టాలని స్పష్టం చేశారు.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనుచరులను కలిగివున్న జేసీ సోదరులకు మూడున్నర సంవత్సరాలుగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ప్రభాకర్ రెడ్డి కొనసాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు కాగా తాడిపత్రిలో రాజకీయ వ్యూహాలతో ప్రభాకర్ రెడ్డి చైర్మన్ స్థానాన్ని దక్కించుకున్నారు. తమతోపాటు కొనసాగుతున్న అనుచరులను కాపాడుకోవడానికి, తాము బలోపేతం కావడంతోపాటు పార్టీని బలోపేతం చేయడానికి నేరుగా తామే రంగంలోకి దిగాలని ఈ సోదరులిద్దరూ నిర్ణయించుకున్నారు.