విజయవాడ, డిసెంబర్ 31,
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో బిజీగా ఉన్నారు. రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయంగా ఉన్నత స్థానాలకు వెళ్తారంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అన్నయ్యగా తన మద్దతు ఉంటుందని ఇప్పటికే హామీ ఇచ్చారు. అటు మెగాఫ్యాన్స్.. ప్రజారాజ్యం మాజీ నేతలు జనసేనకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం తరువాత చిరంజీవి కేంద్ర మంత్రిగా పని చేసారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. తనకు రాజకీయాలు సరిపడవని..సినిమాల పైనే తన ఫోకస్ అని స్పష్టం చేసారు. ఇదే సమయంలో ఏపీ కాంగెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మరుతున్నాయి.చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని.. మెగాస్టార్ కాంగ్రెస్ వాదిగానే ఉంటానని అన్నారని గిడుగు రుద్రరాజు చెప్పుకొచ్చారు. సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల పార్టీ కార్యక్రమాలకి హాజరవడం లేదని వివరించారు. ఇదే సమయంలో వైఎస్సార్ గురించి గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేసారు. రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తామన్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి తమ ముఖ్యమంత్రని చెప్పారు. పార్టీ నిర్ణయించే మేనిఫెస్టోతో పాటుగా వైఎస్సార్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేస్తామని వివరించారు. రాజకీయాల్లో యువతకు అవకాశం ఇవ్వాలనేది పార్టీ ఆలోచనగా చెప్పుకొచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజ్యంగా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.ఏపీ విభజనకు కాంగ్రెస్ ఒక్కటే కారణం కాదని, 16 రాజకీయ పార్టీల ఒత్తిడి ఉందని గుర్తు చేసారు. కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ జోడో యాత్ర ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందన్నారు. జనవరి 25, 26 తేదీల్లో రాహుల్ యాత్ర శ్రీనగర్ లో ముగుస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రజా పోరు నిర్వహిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ తొలి నుంచి ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉందని స్పష్టం చేసారు. అదే నినాదంతో ప్రజాపోరు కొనసాగిస్తామని స్పష్టం చేసారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కాంగ్రెస్ ప్రధాన శత్రువని గిడుగు రుద్రరాజు తేల్చి చెప్పారు. తిరిగి రాష్ట్రంలో ప్రజల ఆదరణ పొందే ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు.