వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. దశాబ్దాలుగా తెలుగు రాజకీయాలను శాసిస్తోన్న సెంటిమెంట్ కోటలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇక పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసిన మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ ఇక్కడ జనసేన నుంచి పోటీ చేయవచ్చని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే వసంత్ తాను వచ్చే ఎన్నికల్లో ఉంగుటూరు నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించినా పార్టీపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఆయన రెండు రోజుల క్రితం జనసేన స్టేట్ కమిటీలో చోటు దక్కించుకున్న తోట చంద్రశేఖర్‌తో కలిసి విశాఖలో పవన్‌కళ్యాణ్‌ను కలిశారు. ఈ కలయిక తర్వాత వసంత్ ఉంగుటూరు నుంచే పోటీ చేస్తారన్న వార్తలు మరింత జోరందుకున్నాయి.నియోజకవర్గంలో కాపుల ఓట్లే 50 వేల వరకు ఉన్నాయి. కాపుల కంటే చాలా ఎక్కువుగా బీసీ ఓటర్లు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని కమ్మ వర్గానికి చెందిన వ్యక్తి. వీరి ఓట్లు 8 వేల వరకు ఉన్నాయి. ఎస్సీలు 36 వేల వరకు ఉన్నారు. కమ్మలు పూర్తిగా, బీసీల్లో మూడొంతుల వరకు టీడీపీ వైపే ఉంటారు. నాలుగు మండలాల్లో నిడమర్రు మండలంలో గత రెండు ఎన్నికల్లోనూ నియోజకవర్గ ఫలితంతో సంబంధం లేకుండా ఓటర్లు తీర్పు ఇస్తున్నారు. 2009లో ఇక్కడ ప్రజారాజ్యానికి మెజార్టీ వస్తే గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి మెజార్టీ వచ్చింది. ఉంగుటూరు మండలంలో ఎప్పుడూ టీడీపీదే మెజార్టీ. భీమడోలు మండలంలో టీడీపీకి పోటీ ఇచ్చేది వైసీపీయా, జనసేనా అన్నది ఆ రెండు పార్టీలే డిసైడ్ చేసుకోవాలి. గణపవరం తీర్పు నియోజకవర్గ ఫలితానికి అనుకూలంగానే ఉంటుంది.జనసేన పోటీతో వైసీపీ నష్టపోయే నియోజకవర్గాల్లో ఉంగుటూరు ప్రథమస్థానంలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ పార్టీ తరపున మాజీ మంత్రి వసంత్‌కుమార్ రంగంలో ఉంటే వైసీపీ ముందుగా టీడీపీని ఢీ కొట్టాలంటే జనసేనతో పోటీ పడి ఆ పార్టీని క్రాస్ చేశాకే టీడీపీని ఎదుర్కోవాల్సి రావచ్చు.ఉంగుటూరు నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపునకు స్టేట్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు లింక్ ఉంది. ఇక్కడ నుంచి గత కొన్ని దశాబ్దాలుగా గెలుస్తూ వస్తోన్న పార్టీయే రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక కూడా ఇక్కడ ఇదే రిపీట్ అవుతోంది. 1983, 85లో ఇక్కడ కంఠమని శ్రీనివాసరావు టీడీపీ నుంచి గెలిచారు. 1989లో చావా రామకృష్ణ కాంగ్రెస్ నుంచి, 1994, 1999లో కొండ్రెడ్డి విశ్వనాథం టీడీపీ నుంచి, 2004, 2009లో వట్టి వసంత్‌కుమార్ కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఈ టైంలలో ఇక్కడ గెలిచిన పార్టీయే ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత ఎన్నికలకు ముందు స్టేట్ డివైడ్ అవ్వడంతో ఇక్కడ టీడీపీ నుంచి తొలిసారి పోటీ చేసిన గన్ని వీరాంజనేయులు వైసీపీ నుంచి పోటీ చేసిన ఉప్పాల వాసుబాబును ఓడించారు. ఇక్కడ సెంటిమెంట్ ప్రకారమే ఏపీలో కూడా టీడీపీయే అధికారంలోకి వచ్చింది.నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వివాదాలకు తావు లేకుండా నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. వ్యక్తిగతంగా క్లీన్ ఇమేజ్ ఆయన సొంతం. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు విషయంలో ప్రతి పనిని ఛాలెంజింగ్‌గా తీసుకుని టాప్ ర్యాంకులు వచ్చేలా చేస్తున్నారు. తాజాగా కైకరంలో జరిగిన నియోజకవర్గ మినీ మహానాడు జిల్లాలోనే అన్ని మినీ మహానాడు కార్యక్రమాల కంటే గ్రాండ్‌గా జరిగింది. సీఎం చంద్రబాబు సభలకు ఇక్కడ గతంలో వచ్చిన రేంజ్‌లో జనాలు వచ్చారు. ఈ సభతో ఎమ్మెల్యే తన సత్తా చాటారు. నియోజకవర్గంలో పార్టీలోనూ, ప్రజల్లోనూ తనకు ఉన్న బలాన్ని చాటారు. ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన నిడమర్రు మండలానికి చెందిన పుప్పాల వాసుబాబుకే మళ్లీ ఉంగుటూరు వైసీపీ సీటు దక్కవచ్చని తెలుస్తోంది. చివరి క్షణంలో సమీకరణలు మారితే ప్రస్తుతం ఏలూరు లోక్‌సభ సీటు వైసీపీ సమన్వయకర్తగా ఉన్న కోటగిరి శ్రీథర్ పేరు కూడా నిన్నటి వరకు వినిపించినా జగన్ ఇక్కడ వాసుబాబును డిస్ట్రర్బ్ చేసేందుకు సాహసించరని పార్టీ వర్గాలే చెపుతున్నాయి.