ముంబై, డిసెంబర్ 31,
కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బూస్టర్ డోస్ తీసుకోవాలని ప్రజలకు సూచించాయి. పైగా...మరోసారి కొవిడ్ వేవ్ వచ్చేస్తుందన్న భయం కూడా అందరిలోనూ మొదలైంది. ఫలితంగా...అంతా అప్రమత్తమయ్యారు. ఇన్నాళ్లు బూస్టర్ డోస్ గురించి పట్టించుకోని వాళ్లు ఇప్పుడు మళ్లీ వ్యాక్సిన్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. బూస్టర్ డోస్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు ఈ విషయంలో ముందంజలో ఉన్నారు. ఢిల్లీలో 100% వ్యాక్సినేషన్ నమోదైందని సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. అయితే...బూస్టర్ డోస్ తీసుకున్నది 24% మంది మాత్రమే. మిగతా వారికి వీలైనంత త్వరగా బూస్టర్ డోస్‌లు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగతా రాష్ట్రాల విషయానికొస్తే...చాలా చోట్ల బూస్టర్ డోస్‌లు అందుబాటులో లేవని తెలుస్తోంది. వ్యాక్సినేషన్ కేంద్రాల వరకూ వచ్చి టీకాలు లేక వెను దిరుగుతున్న పరిస్థితులూ ఉన్నాయి. ఢిల్లీలో మాత్రం ప్రస్తుతానికి ఈ సమస్య కనిపించడం లేదు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో బూస్టర్ డోస్‌లు అందుబాటులో ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. వారం రోజుల ముందుతో పోల్చి చూస్తే...ఇప్పుడు బూస్టర్ డోస్‌లు తీసుకునే వారిసంఖ్య ఒక్కసారిగా పెరిగిందని వైద్యులు తెలిపారు. ప్రపంచ దేశాల్లో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తగా టీకాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఢిల్లీలో అన్ని హెల్త్ సెంటర్లలో రోజుకు 18 వందల మంది బూస్టర్ డోస్‌ల కోసం వస్తున్నారు. అంతకు ముందు ఈ సంఖ్య కేవలం 500 మాత్రమే. భారత్‌లోనూ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోడానికి వ్యాక్సినేషన్ మినహా వేరే ఏ మార్గం లేదు. అందుకే...కేంద్రం అందరూ బూస్టర్ డోస్‌లు తీసుకోవాలని సూచిస్తోంది. చైనా, హాంగ్‌కాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా RT PCR టెస్ట్‌లు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆయా దేశాల్లో ఫ్లైట్ ఎక్కే ముందే ఈ టెస్ట్ చేయించుకుని ఆ రిపోర్ట్‌ని Air Suvidha పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయా ట్విటర్ వేదికగా ప్రకటించారు. "చైనా, హాంగ్‌కాంగ్, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే వాళ్లు RT PCR టెస్ట్‌లు కచ్చితంగా చేయించుకోవాలి. 2023 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది" అని ట్వీట్ చేశారు. ఇప్పటి వరకూ ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇండియాకు వచ్చాక ఎయిర్‌పోర్ట్ వద్ద కొవిడ్ నెగటివ్ రిపోర్ట్ చూపించాలన్న రూల్ ఫాలో అవుతున్నారు. ఒకవేళ ఇక్కడ టెస్ట్ చేశాక పాజిటివ్ వస్తే నేరుగా క్వారంటైన్‌కు తరలి వస్తున్నారు. కానీ... ఇప్పుడు ఫ్లైట్ ఎక్కే ముందే...పోర్టల్‌లో రిపోర్ట్ అప్‌లోడ్ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. భారత్‌లోనే కాదు. చాలా దేశాలు ఇదే రూల్‌ని ఫాలో అవుతున్నాయి. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే వారు తప్పకుండా నెగటివ్ రిపోర్ట్ చూపించాల్సిందే.