YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ కు అడ్డొస్తున్న అవరోధాలు

 కేసీఆర్ కు అడ్డొస్తున్న అవరోధాలు

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఊహించని అవరోధాలు ఎదురవుతున్నాయి.ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా కేసీఆర్ చాలానే కష్టపడ్డారు. ఈ మేరకు వివిధ రాఫ్ట్రాలకు వెళ్లి పలు పార్టీల నాయకులను కలిశారు. ఇందుకోసం ఆయన మొదట యూపీఏ భాగస్వామ్య పక్షాల పార్టీలనే ముందుగా టార్గెట్ చేశారు. కానీ, కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు మాత్రం అవకాశాల కంటే అవరోధాలే ఎక్కువ వస్తున్నాయి. ఆయన పశ్చిమ బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీని కలిసి రాగా, ఆమె కాంగ్రెస్ లేకుండా ఫ్రంటు ఏర్పాటు సాధ్యం కాదని తేల్చేసింది. ఇక చైన్నై వెళ్లి డీఎంకే నేతలు స్టాలిన్, కరుణానిధిలను కలిసి వచ్చారు. వీరు ఇప్పటికే కాంగ్రెస్ భాగస్వామ్య పక్షంగా ఉన్నారు. వారు కేసీఆర్ ప్రయత్నాలను అభినందించినా వారు కలవడంపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ కి వచ్చి ఆయనే కేసీఆర్ ని కలిశారు. కానీ, ఆయన కూడా కాంగ్రెస్ తో దోస్తీని వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లుగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు కేసీఆర్ కి పూర్తిగా మద్దతు ఇచ్చింది మాత్రం జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ మాత్రమే. ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రతిపాదనను ఆయన తెరపైకి తెచ్చారు. వాస్తవానికి గత నెలలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకత, కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలను ఓడించాల్సిన ఆయన చెప్పిన కారణాలు ప్రజలతో పాటు వివిధ పార్టీలను కూడా ఆలోచింపజేశాయి. కర్ణాటక ఎన్నికలకు ముందు కేసీఆర్ బెంగళూరు వెళ్లి జేడీఎస్ నేతలు దేవెగౌడ, కుమారస్వామిని కలిసివచ్చారు. ఎన్నికల్లో వారికి మద్దతు తెలపడంతో పాటు వారికి ఓటేయాల్సిందిగా తెలుగు ప్రజలకు పిలుపు కూడా ఇచ్చారు. అయితే ఎన్నికల అనంతర పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ కాంగ్రెస్ తో జట్టుకట్టింది. అయితే, తాజాగా ఓ జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవెగౌడ మాట్లాడుతూ… కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యం కాదని స్పష్టం చేశారు. కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం వేదికగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామని ఆయన చెప్పారు. అయితే తాము ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వారిలో బీజేపీతో పాటు కాంగ్రెస్ వ్యతిరేకులు కూడా ఉన్నారని, అయితే బీజేపీని గద్దె దించాలంటే కాంగ్రెస్ సహకారం అవసరమని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్ కి ఆయన షాక్ ఇచ్చినట్లయింది. అయితే, మొదట ఈ కార్యక్రమానికి వెళ్లాలనుకున్న కేసీఆర్ నిర్ణయం మార్చుకుని ఒకరోజు ముందుగానే బెంగళూరు వెళ్లి కుమారస్వామిని అభినందించి వచ్చారు. దీంతో ఇప్పుడు ఈ చర్య చర్చనీయాంశమైంది. దేశంలోని వివిధ పార్టీల నాయకులు ఒక్కచోట చేరే ఈ కార్యక్రమానికి కేసీఆర్ ఎందుకు హాజరుకాలేదని తెలియడం లేదు. అయితే, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న కేసీఆర్ కి సోనియా, రాహుల్ తో వేదిక పంచుకోవడం ఇబ్బందిగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం రేపు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఏదేమైనా ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు చేసి రానున్న ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో చురుగ్గా మారాలనుకుంటున్న కేసీఆర్ కి ఆదిలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయనే చెప్పాలి.

Related Posts