కర్నూలు, జనవరి 2,
జనవరి 8వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కర్నూలులో పర్యటించనున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పి. రామస్వామి తెలిపారు. ప్రవాసి యోజన కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాతో పాటు హిందూపురంలో పర్యటించనున్నారని వివరించారు. జిల్లాలోని ఇంటింటికీ వెళ్లి బీజేపీ ప్రభుత్వ పథకాలను వివరించనున్నారు. ఈయనతో పాటు జిల్లాలోని బీజేపీ శ్రేణులంతా తరిలి వెళ్లనున్నట్లు సమాచారం. అలాగే నగరంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో కూడా అమిత్ షా పాల్గొని ప్రసింగించనున్నట్లు తెలుస్తోంది. మూడ్రోజుల క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ సమావేశం అయ్యారు. ఏపీకి చెందిన పలు కీలక అంశాలపై వినతి పత్రం అందించారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపంస్‌ను తిరుపతిలో ఏర్పాటు అంశాన్ని పరిశీలంచాలని హోంమంత్రి అమిత్‌షాకు సీఎం విన్నవించారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఉచితంగా అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రికి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని హోం మంత్రికి జగన్ తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు సుదీర్ఘకాలం గడిచినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని వాటికి సంబంధించిన వివరాలను అమిత్ షాకు జగన్ ఇచ్చారు. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద చెల్లించాల్సిన బకాయిలు అలానే ఉన్నాయన్న సీఎం. 2014–15 కు సంబంధించిన రూ.18,330.45కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తంగా రూ. 32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే మంజూరు చేయాలని అమిత్ షాను జగన్కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్ల రూపాయలను రెండేళ్లుగా చెల్లించలేదు. ఈ డబ్బును వెంటనే చెల్లించాలని కోరారు. అలాగే తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు హేతుబద్ధంగా లేవని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్న విషయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. రాష్ట్రంలో అర్హత ఉన్న 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై కింద లబ్ధి పొందడం లేదని, నెలకు సుమారు 3 లక్షల టన్నులు రేషన్ బియ్యం కేంద్రం వద్ద మిగిలిపోతున్నాయని, ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే అర్హులందరికీ ఆహార భద్రతా చట్టం వర్తింపు చేసినట్టువుతుందని... ఈమేరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరిన ముఖ్యమంత్రి. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అవశ్యమని, పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు.