YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరు వైసీపీలో లొల్లి..మాములుగా లేదుగా

నెల్లూరు వైసీపీలో లొల్లి..మాములుగా లేదుగా

నెల్లూరు, డిసెంబర్ 2, 
ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీలో వర్గ విభేదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ, ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారన్న వాదన ఉంది. నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. విచిత్రం ఏంటంటే.. ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీలో రెండో గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ కూడా బలపడాలని చూస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర టైమ్ ఉండగా.. రెండో గ్రూప్ రాజకీయం మొదలు పెట్టింది. దీంతో ఎమ్మెల్యేల వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలోనూ అలాంటి పరిస్థితే ఏర్పడింది. ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్గంతో పాటు ఆయనకు వ్యతిరేక వర్గం కూడా జోరుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.  ఒక గ్రూపుకి, ఇంకో గ్రూపుకి అస్సలు పడట్లేదు. దీంతో ఫ్లెక్సీలు చించుకోవడం దగ్గర్నుంచి ప్రెస్ మీట్లు పెట్టడం వరకు షరా మామూలే. దుత్తలూరు, వరికుంటపాడు, ఉదయగిరి మండలాల్లో కొంతమంది వైసీపీ నాయకులు వేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. గతంలో జగన్ పుట్టినరోజు సందర్భంగా వేసిన ఫ్లెక్సీలను కూడా ఇలాగే వైరి వర్గాలు చించేశాయి. విచిత్రం ఏంటంటే ఇక్కడ టీడీపీకి ఎవరూ పని చెప్పలేదు. వైసీపీలోనే గ్రూపులు మొదలై ఒకరి ఫ్లెక్సీలు ఇంకొకరు చించేసుకుంటున్నారు. ఫ్లెక్సీలను ఎమ్మెల్యే అనుచరులే చించి వేశారని ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి నేతృత్వంలో నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఫ్లెక్సీలు చించేసినవారిపై చర్యలు తీసుకోవాలంటూ ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు పోలీస్ స్టేషన్ల ముందు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి వ్యతిరేక వర్గం  నిరసన ప్రదర్శన చేపట్టారు. దీని వెనక ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హస్తం ఉందని వారు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ  నేతలే ఇలా రోడ్డెక్కడం నెల్లూరులో హాట్ టాపిక్ అయింది.   స్థానికంగా నాయకులు కొట్టుకోవడం, తిట్టుకోవడం వరకూ ఓకే, కానీ ఇలా జగన్ ఫ్లెక్సీలు చించేస్తే అధిష్టానానికి ఏమని మెసేజ్ ఇచ్చినట్టు. ఇలా అధినేత ఫ్లెక్సీలను చించేస్తూ రాజకీయం ఏంటి అని అంటున్నారు నాయకులు. నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఉన్నారు. ఆయన హయాంలోనూ గొడవలున్నాయి, కానీ ఎప్పటికప్పుడు ఆయన మీటింగ్ లు పెట్టి సముదాయించేవారు. ఇప్పుడు జిల్లా పెత్తనం రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలోకి వెళ్లింది. ఆయన సౌమ్యుడు, మృదు స్వభావి. అజాత శత్రువుగా ఉండాలనేది ఆయన ఆలోచన. అలాంటి భావజాలం ఉన్న వ్యక్తి ఎవరినీ పిలిచి మాట్లాడలేరు, మందలించలేరు. దీంతో జిల్లాలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. అందులోనూ ద్వితీయ శ్రేణి నేతలు కూడా డైరెక్ట్ తమ నేతలకు మద్దతుగా రంగంలోకి దిగుతున్నారు.  ఏది ఉన్నా నేరుగా సజ్జల దగ్గరకో, వైవీ సుబ్బారెడ్డి దగ్గరకో వెళ్తున్నారు. కుదిరితే నేరుగా జగన్ దగ్గరే తేల్చుకుంటామంటున్నారు. దీంతో వ్యవహారం ముదిరి పాకాన పడింది. తిట్టుకోవడం, ఫ్లెక్సీలు చించుకోవడం, ప్రెస్ మీట్లు పెట్టడం వరకు వెళ్లింది. దీంతో ఉదయగిరిలో వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి రోజు రోజుకు గందరగోళంగా మారుతోంది.

Related Posts