విశాఖపట్టణం, జనవరి 2,
విశాఖ పోర్టుకు దేశ విదేశాల నుంచి ఎన్నో రకాల నౌకలు వస్తుంటాయి. చిన్న నౌకలు మొదలు భారీ స్థాయి నౌకలు కూడా వస్తుంటాయి. అయితే, ఇప్పటి వరకు ఎన్నడూ రానటువంటి భారీ సైజు నౌక ఒకటి ఆదివారం నాడు విశాఖ పోర్టుకు వచ్చింది. చూసేందుకు బాహుబలిలా కనిపిస్తోంది ఈ నౌక. దీని పేరు ‘ఎంవి జేసీఎల్ సబర్మతి బేబీ కప్’. దీని సామర్థ్యం ఎంతో తెలుసా? ఈ బాహుబలి నౌక పొడవు 253.50 మీటర్లు, వెడల్పు 43 మీటర్లు. 1,06,529 టన్నుల సరుకును ఒకేసారి తీసుకెళ్లగల సామర్థ్యం ఈ నౌక సొంతం. వెస్ట్ క్వె 1 బెర్త్‌లో ఈ భారీ నౌకను నిలిపారు. విశాఖ పోర్టు చరిత్రలో ఇంతటి భారీ నౌకను నిలపడం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు. కాగా, భారీ సైజు నౌకను చూసేందుకు పోర్టులోని జనాలు ఆసక్తి చూపుతున్నారు. విశాఖపట్నం పోర్టుకు రోజూ అనేక ఓడలు, నౌకలు, చిన్న చిన్న షిప్‌లు కూడా వస్తుంటాయి. ఇక్కడి నుంచి వస్తువుల రవాణా జరుగుతుంది. నిత్యవసరాలు మొదలు.. పారిశ్రామిక ఉత్పత్తులు, ఇతర వస్తువులు కూడా విశాఖ పోర్టు నుంచి జల రవాణా జరుగుతుంది. ఇందులో భాగంగానే.. విశాఖ పోర్టుకు ఈ బాహుబలి నౌక ఇవాళ వచ్చింది.