జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో రాటుదేలినట్లు కన్పిస్తోంది. ఒకవైపు ప్రజాసమస్యలను అవగాహన చేసుకుంటూ పవన్ చేస్తున్న యాత్ర సక్సెస్ ఫుల్ గానే నడుస్తోంది. పవన్ ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో ప్రత్యేక హోదా కోసం కవాతు నిర్వహించడం, ఆ తర్వాత బహిరంగసభలో ప్రసంగించడం వంటి కార్యక్రమాలను చేస్తున్నారు. తన ప్రసంగాల్లో ప్రధానంగా చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అలాగే వైసీపీ అధినేత జగన్ పై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ జనసేనాని ఆకట్టుకుంటున్నారు.ఇక ముఖ్యంగా ప్రజలతో తొలుత మమేకమవుతున్న జనసేనాని వారి నుంచి ఆ ప్రాంత ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యే పనితీరుపై కూడా ఆరా తీస్తున్నారు. పలాస ఎమ్మెల్యే అల్లుడి నిర్వాకాన్ని ఈ సందర్భంగా పవన్ ఎండగట్టారు. పలాస ఎమ్మెల్యే అల్లుడికి ఇక్కవ వ్యాపారులు జీఎస్టీ కట్టాలంటూ పవన్ తీవ్ర విమర్శలే చేశారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా భూకబ్జాలేనంటూ విమర్శించారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదంటూ ఆరోజు చంద్రబాబు వ్యాఖ్యలు చేసి, ఇప్పుడు అదే ప్రత్యేక హోదా కోసం ధర్మపోరాటదీక్షలకు దిగడంపై పవన్ ఎద్దేవా చేశారు.వైసీపీ అధినేత జగన్ లా తాను మాట్లాడలేనన్నారు. జగన్ అరే ఒరే అని పిలుస్తారని, కానీ తాను అలా సంస్కార హీనంగా మాట్లాడలేనని చెప్పారు. ప్రజాసమ్యలపై అసెంబ్లీలో ప్రజల పక్షాన పోరాల్సిన జగన్ పారిపోయి రాజకీయ లబ్దికోసమే పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వస్తే అరాచకం జరుగుతుందని భావించి ఆనాడు తాను టీడీపీకి మద్దతిచ్చానని, అయితే చంద్రబాబు హయాం కాంగ్రెస్ ను మించిపోయిందన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామని చెప్పిన చంద్రబాబు నాలుగేళ్లుగా పట్టించుకోలేదన్నారు. ఈసారి వస్తే చొక్కా పట్టుకుని నిలదీయాలని పవన్ ప్రజలను కోరారు. పవన్ పర్యటన మొత్తం టీడీపీ, వైసీపీల మీద విమర్శలతోనే సాగుతోంది. తాను మాత్రం వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెబుతూ వస్తున్నారు.