విశాఖపట్టణం, జనవరి 3,
జీవీఎల్ నరసింహారావు. ఉత్తర ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు. 2024 నాటికి ఆయన పదవీ కాలం ముగియనుండగ ఈసారి ప్రత్యక్ష ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. బీజేపీకి గౌరవ ప్రదమైన ఓట్ బ్యాంక్., గతంలో గెలిచిన చరిత్ర ఉన్న విశాఖపట్టణం మీద కర్చీఫ్ వేశారు. వలస నేతలను ఆదరించే అర్బన్ ఓటర్లను ఆకర్షించడం ద్వారా ప్రజాక్షేత్రంలో గెలవాలనేది జీవీఎల్ ఆలోచన అట. అందుకే కొద్దికాలంగా ఢిల్లీ టు వైజాగ్ షెటిల్ సర్వీస్ చేస్తున్న ఆయన.. ఇటీవల క్యాంప్ కార్యాలయం ప్రారంభించడమే కాదు ఇల్లు కొనుక్కొని మరీ నేనూ లోకలకే అంటున్నారు.జీవీఎల్ పోటీపై బీజేపీ హైకమాండ్ ఆలోచన ఎలా ఉందో కానీ.. ఆయన మాత్రం చాలా ముందుగానే గ్రౌండ్‌లో దిగారు. విశాఖ అభివృద్ధి నినాదం భుజానికెత్తుకొని అటు ఢిల్లీలోనూ.. ఇటు గల్లీలోనూ హడావుడి చేస్తున్నారు జీవీఎల్. కాస్మోపాలిటీన్ నగరం కావడంతో అర్బన్ ఓటర్ల తీర్పు కీలకమనే లెక్కలు బాగా వంటబట్టించుకున్నట్టే కనిపిస్తోంది ఈ సెఫాలిజిస్టు. మత్య్సకార, యాదవ, కాపు సామాజికవర్గాలకు చేరువయ్యే విధంగా ఆయన కదలికలు ఉంటున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్, ఐటీ రంగ అభివృద్ధి వంటి కీలకమైన అంశాలపై ఫోకస్ పెంచారు జీవీఎల్. ఈ తరుణంలో తరచుగా రాజ్యసభలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీ కంటే ఆంధ్రప్రదేశ్ మరీ ముఖ్యంగా విశాఖ, ఉత్తరాంధ్ర వ్యవహారాలను లేవనెత్తుతున్నారు. ఐతే, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రాజకీయంగా ఆశించిన మైలేజ్, ఆయన హడావిడిపై జనంలో చర్చ జరగడం లేదట. దీంతో జీవీఎల్ స్టయిల్ మార్చారు.సాంప్రదాయ రాజకీయాలను తనవైపు తిప్పు కోవాలంటే కాంట్రవర్సీ కామన్ పాయింట్‌గా మలుచుకోవడమే కరెక్ట్ అని జీవీఎల్ భావిస్తున్నట్టు సమాచారం. సంస్థాగతంగా బలంలేని బీజేపీ నుంచి పోటీ చేసి టీడీపీ, వైసీపీలను ఎదుర్కోవడం సాధ్యం కాదనేది బహిరంగ రహస్యం. అదే సమయంలో జీవీఎల్ కు కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. ఏపీ బీజేపీలో Aటీమ్, Bటీమ్ ఉన్నాయనేది ప్రత్యర్ధులు చేసే బహిరంగ విమర్శ. ఒకవర్గం టీడీపీకి అనుకూలంగా పని చేస్తుందని, రాష్ట్ర ప్రతిష్టతను ప్రయోజనాలను దెబ్బ తీయడమే లక్ష్యంగా పెట్టుకుందని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బహిరంగ వేదికలపైన టీబీజేపీ అంటూ సెటైర్లు వేస్తోంది. దీంతో జీవీఎల్ ఏ పక్షం అనే చర్చ వస్తోంది. దీంతో ఎంపీ మళ్లీ స్టయిల్ మార్చారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తన బాధ్యత అంటూనే కాంట్రవర్సీని ఆయుధంగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. తద్వారా నిరంతరం వార్తల్లో నిలవాలనేది అసలు ఎత్తుగడ అట. ఇందులో జీవీఎల్ సక్సెస్ అయ్యారట.ఇటీవల విశాఖ వేదికగా కాపునాడు బహిరంగ సభ జరిగింది. రాజకీయ కారణాలతో ప్రధాన పార్టీలు దూరం పాటించాయి. కాపు కాకపోయినా కాపునాడు సభకు వెళ్లిన జీవీఎల్ పెద్దకాపు అవతారం ఎత్తారు. కాపులకు మద్దతు పలికారు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టమంటే కాపు నేతలే ముందుకు రావడం లేదని వేడి రాజేసే ప్రసంగం చేశారు. రంగా విగ్రహాన్ని బీచ్ రోడ్డులో ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో ప్రభుత్వానికి లేఖ రాసేందుకు సిద్ధం అయ్యారు. విశాఖ నుంచి లోక్ సభ కు పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న జీవిఎల్ మాత్రం ఈ సభను వాడుకొని కాపుల్లో క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేశారనే ప్రచారం జరుగుతోంది.రాజ్యసభ సభ్యుడైన కొత్తలో తన సొంత ఊరు ఉన్న నరసరావుపేట లోక్‌సభ పరిధిలో GVL ఎక్కువగా పర్యటనలు చేసేవారు. దాంతో అక్కడ పోటీ చేయాలనే ఆలోచనతోనే తిరుగుతున్నారని అనుకున్నారు. తర్వాత ఏమైందో ఏమో.. ప్రస్తుతం విశాఖపై దృష్టి పెట్టారు. విశాఖ నుంచి గతంలో కంభంపాటి హరిబాబు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన గవర్నర్‌గా ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి విశాఖలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పురందేశ్వరికి 33 వేల ఓట్లు వచ్చాయి. పురందేశ్వరి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విశాఖ ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగానూ పనిచేశారు. మరి.. వచ్చే ఎన్నికల్లో పురందేశ్వరి విశాఖ రారని అనుకున్నారో ఏమో.. జీవీఎల్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో అధికారపార్టీకి చెందిన జిల్లా నేతలపై బీజేపీ ఎంపీ చేస్తున్న విమర్శలు కొత్త రచ్చకు దారితీస్తున్నాయి.ఐటీ, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ లక్ష్యంగా జీవీఎల్ చేసిన విమర్శలు కాక రేపుతున్నాయి. ఐటీ ఎక్స్‌పోర్ట్స్‌లో ఛత్తీస్ ఘడ్ కంటే దారుణం అంటూనే.. మంత్రి అమర్నాథ్ కు ఓరియంటేషన్ అవసరమని ఆయన చురకలు అంటించారు.