నెల్లూరు, జనవరి 3,
ఆనం రామనారాయణరెడ్డి. నెల్లూరుకే కాదు.. రాష్ట్ర రాజకీయాలకు సుపరిచితుడు. టీడీపీలో రాజకీయాల్లోకి వచ్చి అక్కడే మంత్రి.. ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చి వైఎస్ కేబినెట్‌లో మంత్రి అయిన సీనియర్ మోస్ట్ లీడర్. కాంగ్రెస్‌లో ప్రారంభమైన రాజకీయ జీవితాన్ని టీడీపీ.. టీడీపీ నుంచి కాంగ్రెస్.. కాంగ్రెస్ నుంచి మళ్లీ టీడీపీ.. ఇప్పుడు వైసీపీ. మొన్నటి ఎన్నికల్లో వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలిచారు ఆనం. సీనియారిటీ.. కేబినెట్‌లో చోటు తెచ్చిపెడుతుందని ధీమాతో ఉన్న ఆనంకు జగన్ ఝలక్ ఇచ్చారు. సీనియర్ మోస్ట్ ఆనంను పక్కన పెట్టి.. అదే జిల్లాలో ఆనంకు జూనియర్.. రెండోసారి ఎమ్మెల్యే అయిన అనిల్, గౌతంరెడ్డిలకు మంత్రి పదవులు ఇచ్చారు. అప్పటి నుంచి ఆనం దానిని జీర్ణించుకోలేకపోతున్నారుఅంత అనుభవం ఉన్న తనను వెంకటగిరి… ఎమ్మెల్యే గిరికే పరిమితం చేశారని అవమానంగా ఫీలవుతున్నట్టు ఉన్నారు. అయివే వీటిని వేటినీ ఆనం మనసులో పెట్టుకోవడం లేదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా అటు ప్రభుత్వానికి ఇటు ప్రత్యర్థులైన అనిల్‌కు, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డికి పంచ్‌లు వేస్తూనే ఉన్నారు. ప్రత్యర్థుల వరకు సెటైర్లు వేయడం పర్వాలేదు కానీ.. పదవి ఇచ్చిన పార్టీ అధిష్ఠానం మీదనే ఆయన చేస్తున్న కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. ప్రతిపక్షాలను మించిన స్థాయిలో ప్రభుత్వం మీద ఆనం బాణాలు విసురుతున్నారు. అసలు ఏం చేశామని ఓట్లు అడుగుతామంటూ పెద్ద డైలాగులు వేశారు. ఒకపక్క సీఎం జగన్ 65 లక్షల మందికిపైగా ఇస్తున్న ఫించన్లను ఒక కార్యక్రమంగా తీసుకొని వారోత్సవాలుగా నిర్వహించాలని అనుకుంటుంటే.. అసలు ఫించన్లు ఇస్తేనే ఓట్లు వేస్తారా అంటూ ఆనం అన్నారు. అంతేకాదు.. ఫించన్లు మనమే ఇస్తున్నామా.. టీడీపీ ఇవ్వలేదా అని అన్నారు. ఆనం అంతటితో ఆగలేదు. ఇళ్ల స్థలాలు ఇచ్చాం కానీ.. ఇళ్లు కట్టామా? మన ఫించను డబ్బులు గతుకుల రోడ్డులో పడిన వారి ఆస్పత్రి ఖర్చులకు కూడా సరిపోవడం లేదంటూ ఒకటి వెంట ఒకటిగా విమర్శలు గుప్పించారు. ఇవి చూసిన వాళ్లకు ఆనం వైసీపీలో ఉన్నారా? లేక మరేదైనా పార్టీలో ఉన్నారా అనే అనుమానం కలిగింది. అదేమంటే.. నేను ప్రభుత్వానికి తప్పులు ఎత్తిచూపడం తప్పా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉంటే నియోజకవర్గంలో నేదురుమల్లి ఫ్యామిలీతో ఉన్న పాతకక్షలు ఆయన్ని వెంటాడుతూనే ఉన్నాయి. అది ఆనంకు ఇబ్బందిగా మారిపోయాయి. ఆనం ఉండగానే నియోజకవర్గంలో తిరుగుతున్న నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి .. వెంకటగిరికి తానే ఇంఛార్జ్‌ను అని..ఈ సారి సీటు తనకేనని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ఆనంకు అస్సలు నచ్చడం లేదు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం నుంచి ఆనంకు మద్దతు దొరకడం లేదు. ఇది ఆనంకు మరింత చికాకు పుట్టించిందట. అందుకే ఏకంగా పార్టీ కన్వీనర్ల మీటింగ్‌లోనే బరస్ట్ అయ్యారు. ఇవి ఇప్పటివి. అంతకుముందు నెల్లూరులో సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయని.. తమ మాటలకు విలువ లేకుండా పోయిందని అని అన్నారు. మంత్రిగా కాకాణి వచ్చాక… యాక్టివ్ కావడానికి ప్రయత్నం చేసినా.. పెద్దగా వర్కవుట్ కాలేదు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు ఎవరూ మాట్లాడని విధంగా సొంత పార్టీ మీద ఆనం చేస్తున్న విమర్శలు ఆయన మనసులో ఏదో ఉందన్న డౌట్‌ను కేడర్‌లో కలిగిస్తున్నాయి. పార్టీ మారాల్సిన అవసరం తనకేముందని పైకి అంటున్నా.. ఇంకేదో ఆయన ఆశిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.