YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రత్యేక ఆంక్షలు... సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు...

ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రత్యేక ఆంక్షలు...  సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు...

న్యూఢిల్లీ జనవరి 3
వాక్ స్వాతంత్ర్యం హక్కు భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్లమెంటు సభ్యులు, మంత్రులు, శాసన సభ సభ్యులకు కూడా సామాన్య ప్రజానీకంతో సమానంగా ఈ హక్కు ఉంటుందని తీర్పు చెప్పింది. ప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్ర్యం హక్కుపై అదనపు ఆంక్షలను విధించడం సాధ్యం కాదని వివరించింది.2016 జూలైలో తన భార్య, కుమార్తె సామూహిక అత్యాచారానికి గురయ్యారని, ఈ కేసుపై విచారణను ఢిల్లీకి బదిలీ చేయాలని ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి పిటిషన్‌ను దాఖలు చేశారు. సామూహిక అత్యాచార బాధితులపై ఉత్తర ప్రదేశ్‌కు చెందిన నేత అజం ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వీ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ బీవీ నాగరత్న రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది.న్యాయవాది కలీశ్వరం రాజ్ పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తూ, గతంలో వచ్చిన తీర్పులు కేవలం విద్వేష ప్రసంగాలపై మాత్రమే వచ్చాయని, చట్టసభల సభ్యుల కోసం ప్రవర్తన నియమావళి ఉండవలసిన అవసరం ఉందన్నారు.భారత రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఏ) ప్రకారం వాక్ స్వాతంత్ర్యం ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తన తీర్పులో పేర్కొంది. ఈ హక్కు ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులకు కూడా సమానంగా ఉంటుందని తెలిపింది. ప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్ర్యంపై ఆంక్షలు రాజ్యాంగంలోని అధికరణ 19(2) ప్రకారం నిర్దేశించిన దానికి అతీతంగా ఉండకూడదని వివరించింది. ఈ ఆంక్షలు సమగ్రమైనవని, అందరికీ సమానంగా వర్తిస్తాయని తెలిపింది. ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఓ మంత్రి చేసే ప్రకటనలు, వ్యాఖ్యలను ఆ ప్రభుత్వానికి ప్రత్యామ్యాయంగా చేసినట్లు ఆపాదించలేమని పేర్కొంది.ప్రభుత్వ పదవులను నిర్వహించేవారు సొంతంగా తమపై ఆంక్షలు విధించుకోవాలని రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది లిఖితపూర్వకంగా లేనటువంటి నిబంధన అని పేర్కొంది. చులకనతో కూడిన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తవహించాలని తెలిపింది. ఇది రాజకీయ, సామాజిక జీవనంలో ఉండాలని పేర్కొంది.జస్టిస్ బీవీ నాగరత్న ఇచ్చిన తీర్పులో, భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం ప్రజలకు చాలా అవసరమని, ప్రజలకు పరిపాలన గురించి సమాచారం బాగా తెలియాలని, పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని, దీని కోసం ఈ హక్కులు అవసరమని తెలిపారు. అయితే ఇది విద్వేష ప్రసంగంగా మారకూడదన్నారు.ప్రజా జీవితంలో ఉన్నవారికి స్వయంగా విధించుకునే ప్రవర్తనా నియమావళి ఉండాలని చెప్పారు. ఓ మంత్రి అభిప్రాయాలు ప్రభుత్వ వైఖరిని, అభిప్రాయాలను ప్రతిబింబిస్తే, ప్రభుత్వంపై సమష్టి, ప్రత్యామ్నాయ బాధ్యతను మోపవచ్చునన్నారు. వాక్ స్వాతంత్ర్యం హక్కుపై అదనపు ఆంక్షలను తీసుకురావలసిన బాధ్యత పార్లమెంటుదేనని చెప్పారు. రాజకీయ పార్టీలు తమ సభ్యులు ప్రసంగించడానికి తగిన నియమావళిని రూపొందించడంపై ఆయా పార్టీలే పరిశీలించాలన్నారు.జస్టిస్ వీ రామసుబ్రహ్మణ్యం ఇచ్చిన తీర్పులో, వాక్ స్వాతంత్ర్యం, జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కులకు సంబంధించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ ప్రైవేటు వ్యక్తులకు, ప్రభుత్వేతర శక్తులకు కూడా వర్తిస్తుందని చెప్పారు. ప్రజల ప్రాథమిక హక్కులను ప్రైవేటు వ్యక్తులు ఉల్లంఘించినప్పటికీ, రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. వాక్ స్వాతంత్ర్యంపై రాజ్యాంగంలో పేర్కొన్న ఆంక్షలు మినహా, అదనంగా ఇతర ఆంక్షలను విధించలేమన్నారు.

Related Posts