న్యూఢిల్లీ, జనవరి 5,
దేశంలో కరోనా వైరస్ మళ్లీ వెంటాడుతోంది. మూడేళ్ల కిందట దేశాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లతో వ్యాపిస్తోంది. ఇప్పుడు ఫోర్త్ వేవ్‌లో కేసులు నమోదవుతున్నాయి. ఇక చైనాలో కొత్త వేరియంట్ బిఎఫ్ 7వేరియంట్ ప్రపంచ దేశాలకు పాకుతోంది. భారత్‌లో ఈ కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో కరోనా వైరస్ వేరియంట్ ఓమిక్రాన్ సబ్-వేరియంట్ బిఎఫ్ 7 నాలుగు కేసులు నమోదు అయ్యాయి. అయితే అందరూ అమెరికా నుంచి వచ్చారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చిన నలుగురి జీనోమ్ సీక్వెన్సింగ్‌లో వారికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ తెలిపింది. నలుగురి పరిస్థితి నిలకడగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. నలుగురిలో ముగ్గురు నాడియా జిల్లాకు చెందిన వారని, ఒకరు బీహార్ నివాసి అని, ప్రస్తుతం కోల్‌కతాలో నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. గత వారం కూడా కోల్‌కతా విమానాశ్రయంలో కోవిడ్ -19 పరీక్షలో ఒక విదేశీ పౌరుడితో సహా ఇద్దరు వ్యక్తులు సోకినట్లు గుర్తించారు. అతని జీనోమ్ సీక్వెన్సింగ్ తర్వాత అతను ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎఫ్ 7 సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. ఇప్పుడు ఈ వేరియంట్ చైనాలో బీభత్సం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచారు.అమెరికా నుంచి తిరిగి వచ్చిన యువతకి యూపీలో సోకినట్లు గుర్తించారు. విమానాశ్రయంలో స్క్రీనింగ్, టెస్టింగ్ కూడా చేస్తున్నారు. ఇదిలా ఉండగా, అమెరికాలో చదువుతున్న ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన యువకుడికి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కరోనా సోకింది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత గొంతునొప్పి, దగ్గు, జ్వరంతో ఆయన ఆరోగ్యం క్షీణించిందని యూపీ ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై తన శాంపిల్‌ను పరీక్షకు పంపామని, దాని నివేదిక మంగళవారం వచ్చిందని, అతనికి కరోనా సోకిందని ఆయన చెప్పారు. ఇంట్లో ఒంటరిగా ఉండాలని కోరినట్లు అధికారి తెలిపారు.కొత్త సంవత్సరంలో కరోనా ముప్పు పొంచి ఉందని ఇప్పటికే అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా హెచ్చరించింది. ఒక కొత్త వేవ్ రావచ్చని, ఇప్పుడు ఎక్స్ బిబి 1.5 వేరియంట్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.