నెల్లూరు , జనవరి7
ఇద్దరూ వైసీపీ ఎమ్మెల్యేలే. ఇద్దరూ అదే జిల్లాకు చెందిన వారే. కానీ జగన్ మాత్రం ఒకరికే ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశమైంది. వారే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి. ఆనం రామనారాయణరెడ్డి గత కొద్ది రోజలుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కోటంరెడ్డిదీ సేమ్ సీన్. అయితే కోటంరెడ్డికి మాత్రం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఆయనతో చర్చించారు. జగన్ స్వయంగా పిలిపించుకుని కోటంరెడ్డితో మాట్లాడారు. కానీ ఆనం రామనారాయణరెడ్డికి మాత్రం ఇంతవరకూ పిలుపు రాలేదు. అంటే ఆనంను ఇక అఫిసియల్‌గా వదులుకున్నట్లేనా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది ఇద్దరూ వైసీపీ నుంచి ఎన్నికైన వారే. ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే. ఇద్దరూ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారే. ఇద్దరూ అధికారులపై మండిపడుతున్న నేతలే. మరి ఒక్కరికే ఎందుకు పిలుపు వచ్చింది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. దశాబ్దకాలాల నుంచి వారు నెల్లూరు జిల్లాలో ఎదురు లేకుండా ఉన్నారు. పైగా తన తండ్రి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చినా గౌరవించి వెంకటగిరి టిక్కెట్ ఇచ్చి జగన్ ఆనం రామనారాయణరెడ్డిని గౌరవించారు. అయితే జగన్ కు ఆ జిల్లా వైసీపీ నేతలతో ఉన్న అనుబంధం కారణంగా వెనక వచ్చిన ఆనంకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆనం మాత్రం తన తోటి ధర్మాన ప్రసాదరావును కేబినెట్ లోకి తీసుకున్నప్పుడు తనకు ఇవ్వడంలో వచ్చిన నష్టమేంటని సన్నిహితుల వద్ద ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఆనం రామనారాయణరెడ్డి ఈ మధ్య కాలంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా మరొకరు తాను ఎమ్మెల్యేనని చెప్పుకుని తిరగడమేంటని ప్రశ్నించారు. నాలుగేళ్లలో ఏం చేశామని ప్రజలను ఓట్లు అడుగుతామని వాలంటీర్ల సభలోనే ఆనం నిలదీశారు. కనీసం ఒక్క ప్రాజెక్టును నిర్మించలేకపోయామని సూటిపోటి మాటలతో సూటిగా హైకమాండ్ కు తగిలేలా వ్యాఖ్యానించారు. వైసీపీలోనే ఉండి అదే ప్రభుత్వాన్ని ఆయన ధైర్యంగా విమర్శించడమేంటని పార్టీ నేతలు కూడా ముక్కున వేలేసుకున్నారు. కానీ ఆనం రామనారాయణరెడ్డి మాత్రం అంతటితో ఆగలేదు. ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ పార్టీ హైకమాండ్ ఆనంను చూసీ చూడనట్లుగా వదిలేసింది. సేమ్ టు సేమ్ కాకపోయినా అదే స్థాయిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా కామెంట్స్ చేశారు. తన నియోజకవర్గంలో పింఛన్లను తొలగించడంపై ఆయన బహిరంగ విమర్శలే చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి రావత్ పైన కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా విమర్శలు చేశారు. రహదారులు సరిగా లేవని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు విడుదల చేయడం లేదని ఆయన ప్రతి సమావేశంలో ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేశారు.అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాత్రం జగన్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జి బాలినేని శ్రీనివాసులురెడ్డి కూడా జగన్ తో భేటీకీ హాజరయ్యారు. నేరుగా జగన్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసంతృప్తికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తాను ఏ పరిస్థితుల్లో విమర్శలు చేయాల్సి వచ్చిందో కోటంరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే ప్రభుత్వంపై విమర్శలు బహిరంగంగా చేయకుండా తన దృష్టికి తేవాల్సి ఉందని కోటంరెడ్డితో జగన్ అన్నట్లు సమాచారం. అదే సమయంలో జిల్లా మంత్రి వ్యవహార శైలిని కూడా కోటంరెడ్డి తప్పుపట్టినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడిన జగన్, ఆనం విషయంలో ఎందుకు దూరంగా ఉన్నారన్న విషయం ఇప్పటికే అర్థమయి ఉంటుంది.