హైదరాబాద్, జనవరి7
కర్ణాటకలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా దానిని కూల్చివేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అనంతరం వయసు సాకుగా చూపి ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్పను తప్పించారు. దీంతో బీజేపీకి నిన్న మొన్నటి వరకూ సానుకూలంగా ఉన్న లింగాయత్ వర్గంలో అసంతృప్తి ఏర్పడిందంటున్నారు. యడ్యూరప్ప పార్టీలోనే ఉన్నా ఆయన పక్కన పెట్టడంపై లింగాయత్ లు మండిపడుతున్నారు. దీంతో బీజేపీకి వచ్చే ఎన్నికల్లో లింగాయత్ లు దూరమయ్యే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత మరింత పుంజుకుంది. గత శాసనసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ 80 స్థానాలను సాధించింది. ఈసారి కూడా అత్యధిక స్థానాలను గెలుచుకునే అవకాశముందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ చేసిన సర్వేలో వెల్లడయింది. ఈ సంస్థ డిసెంబరు చివరి వారంలో తొలి ట్రాకర్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను సాధిస్తుందని తేలింది. మొత్తం 224 ఉన్న కర్ణాటక అసెంబ్లీలో పూర్తి స్థాయి మెజారిటీ రాకపోయినా అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని చెప్పింది అయితే ఇంకా రెండు, మూడు దఫాలు సర్వేలు చేయాల్సి ఉందని, ఎన్నికలు సమీపించే కొద్దీ ట్రెండ్ మారే అవకాశాలున్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు సమిష్టిగా పనిచేయడం, ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా ఈసారి ప్రభుత్వ మార్పిడి ఖాయమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. జేడీఎస్ కొన్ని ప్రాంతాల్లోనే ప్రభావం చూపే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గరపడే సమయంలో బీజేపీ ప్లాన్ మార్చుకుని, అనుసరించే వ్యూహాలపై దాని గెలుపు ఆధారపడుతుందనే వారు కూడా లేకపోలేదు. కర్ణాటకలో మాత్రం ప్రస్తుతం కమలం పార్టీ గడ్డు పరిస్థిితిని ఎదుర్కొంటోంది. దానిని అధిగమించేందుకు కమలం పార్టీ పెద్దలు ఇప్పటి నుంచే రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఇక వరస పర్యటనలతో హోరెత్తించనున్నారు. కర్ణాటకను కోల్పోతే కమలం పార్టీ సౌత్ లో నామమాత్రం అయినట్లేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి.