Highlights
బనగానపల్లె నియోజకవర్గంలో వర్గాల ఆధిపత్యానిదే పైచేయి. ఇప్పటికీ కొన్ని గ్రామాలు వర్గనేతల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీసీ జనార్దన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఈ నాలుగేళ్లు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఎమ్మెల్యే బీసీ ముందున్నారు. ప్రతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో టీడీపీ అధి నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మినీ మహానాడును ఎమ్మెల్యే బీసీ నియోజకవర్గంలో జరపకపోవడం చర్చనీయాంశ మైంది. మాజీ ఎమ్మెల్యే చల్లా రామక్రిష్ణారెడ్డికి అధి నాయకత్వం హామీ ఇచ్చిన నామినేటెడ్ పోస్టు ఇవ్వకపోవడం.. నియోజకవర్గంలో జరుగుతున్న తాజా పరిణామాలపై జిల్లా, రాష్ట్ర నాయకత్వం పట్టించుకోకపోవడం వల్ల ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మనస్తాపానికి గురయ్యారని సమాచారం. అందు వల్లే మినీ మహానాడు జరపలేదని తెలుస్తోంది.
బనగానపల్లె నియోజకవర్గంలో చల్లా, కాటసాని, ఎర్రబోతుల వర్గాలు ప్రధానంగా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో బీసీకి మాజీ ఎమ్మెల్యే చల్లా రామక్రిష్ణారెడ్డి పూర్తి సహకారాన్ని అందించారు. ఫలితంగా అవుకు మండలంలో 5వేలకు పైగా ఓట్ల మెజారిటీ టీడీపీకి వచ్చింది. ఎన్నికల సందర్భంగా చల్లాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నాలుగేళ్లలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. చల్లాకు మాత్రం అవకాశం దక్కలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చల్లాకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే బీసీ అధి నాయకత్వంపై ఒత్తిడి తెచ్చారు. అవకాశం దక్కకపోగా ఇటీవల నియమించిన నామినేటెడ్ పదవుల్లో చల్లాకు ఆర్టీసీ కడప రీజియన్ చైర్మన్ పదవి ఇచ్చారు. సీనియర్ నాయకుడినైన తనకు రీజనల్ పదవి ఇస్తారా..? అంటూ ఆ పదవిని చల్లా తిరస్కరించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు చల్లాను పిలిపించి చర్చించారు.
సివిల్ సప్లయ్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. నెలలు గడిచినా హామీ అమలు కాలేదు. మరో పక్క ప్రతిపక్ష వైసీపీ మాత్రం గ్రామాల్లో తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటోంది. అదే క్రమంలో గత ఎన్నికల నాటి నుంచి దూరంగా ఉంటూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి వర్గాలు ఏకమయ్యాయి. అంతేకాదు.. చల్లాను కూడా వైసీపీలోకి లాగేందుకు కడప జిల్లాకు చెందిన వైసీపీ కీలక నాయకుడు ఒకరు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్ష వైసీపీ ఓ పక్క అన్ని వర్గాలు కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే.. టీడీపీ జిల్లా, రాష్ట్ర నాయకత్వం మాత్రం బనగానపల్లెను పట్టించుకోకపోవడం, చల్లాకు సరైన నామినేటెడ్ పదవి ఇవ్వకపోవడం పార్టీలో ప్రధాన చర్చనీయాంశమైంది. జిల్లా నాయకత్వం, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పార్లమెంట్ ఇన్‌చార్జిలు పట్టించుకోకపోవడం వల్లనే ఎమ్మెల్యే బీసీ మినీ మహానాడుకు దూరంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
నంద్యాల డివిజన్‌లోని కీలక పదవుల్లో ఉన్న అధికార పార్టీ నాయకులు కొందరు బనగానపల్లె నియోజకవర్గంలోని ప్రతిపక్ష పార్టీ నాయకుల పనులు చేసి పెడుతున్నట్లు తెలుస్తోంది. బంధుత్వం కారణంగా వైసీపీ నాయకుల పనులు చక చకా సాగిపోతున్నాయని టీడీపీ నాయకులు కొందరు ఆరోపిస్తున్నారు. ఈ విషయం జిల్లా నాయకత్వం గతంలో అధి నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో ఉంటూ ప్రతిపక్ష నాయకులకు పనులు చేసి పెట్టడం ఏమిటని కొందరు టీడీపీ నాయకులు అంటున్నారు. ఇలా అయితే గ్రామాల్లో ఎలా బలపడతామని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా నాయకత్వం చొరవ తీసుకుని బనగానపల్లె నియోజకవర్గంలో రాజకీయ హామీల అమలుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అధికార పార్టీ నాయకులు కొందరు పేర్కొంటున్నారు.