కర్నూలు , జనవరి 10
ఏపీలో రాజధాని రచ్చ ఇప్పటిలో ఆగేలా లేదు..ఎప్పుడైతే జగన్ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారో అప్పటినుంచి రచ్చ జరుగుతూనే ఉంది. వైసీపీ ఏమో మూడు రాజధానులు అమలు చేయాలని, టీడీపీ, ఇతర విపక్షాలు, అమరావతి రైతులు…అమరావతినే రాజధానిగా చేయాలని పోరాటాలు చేయడం..కోర్టులకు వెళ్ళడం..వెరసి మూడున్నర ఏళ్లుగా ఈ రాజధాని రగడ నడుస్తోంది. చివరికి రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పలేని పరిస్తితి.అసలు ఏపీ రాజధాని ఏది అని పక్క రాష్ట్రాల వాళ్ళు అడిగితే ఏమి చెప్పలేని స్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారని చెప్పవచ్చు. అలాంటి పరిస్తితుల్లో రాజధాని అంశంపై రోజుకో రచ్చ జరుగుతుంది. మూడు రాజధానులు అని డిమాండ్ చేస్తున్న కొందరు వైసీపీ నేతలు..విశాఖనే అసలు రాజధాని అని మాట్లాడుతూ..మిగిలిన ప్రాంతాల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నారు. ఇటు టీడీపీ వాళ్ళు ఏమో అమరావతిని రాజధానిగా కొనసాగించి మిగిలిన ప్రాంతాలని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు రాజధానిపై రకరకాలుగా మాట్లాడుతున్నారు.ఇదే సమయంలో కర్నూలుకు చెందిన సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కొత్తగా ఓ బాంబు పేల్చారు. మూడు రాజధానులు వద్దు అని.కేవలం కర్నూలుని మాత్రం రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి ధర్మాన ప్రసాదరావు విశాఖని రాజధానిగా చేయకపోతే ఉత్తరాంధ్రని సెపరేట్‌గా రాష్ట్రం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రాయలసీమని సెపరేట్ గా రాష్ట్రం చేయాలని బైరెడ్డి కోరారు.ఇప్పుడు శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలుని రాజధానిగా చేయాలని, 1953లో కర్నూలు రాజధానిగా ఉందని, ఆ తర్వాత హైదరాబాద్‌కు మార్చారని, కాబట్టి ఇప్పుడు కర్నూలుని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో రాజధాని అంశం ఇప్పటిలో తేలేలా లేదు.