విజయవాడ, జనవరి 10
రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ వెనుక అసలు కారణమేమిటన్న ప్రశ్నకు అనూహ్యమైన సమాధానం పరిశీలకుల నుంచి వస్తున్నది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వచ్చి మరీ జనసేనాని పవన్ కల్యాణ్ కలవడం వెనుక ఉన్నది ఎవరన్న దానికి ఆర్ఎస్ఎస్ అన్న సమాధానం వస్తోంది. అసలు గత కొంత కాలం నుంచీ ఏపీలో అధికార వైసీపీ ఆగడాలను అడ్డుకోవడానికి, అరాచకాలను ప్రశ్నించి ఎదుర్కొనడానికి ఐక్య పోరాటం అవసరమన్న భావన అన్ని వర్గాల్లోనూ వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ చంద్రబాబుల భేటీకి అత్యంత రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.ఇంత కాలం ఎవరికి వారుగా ప్రజా క్షేత్రంలో జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న ఇరు పార్టీల అధినేతలూ భేటీ అవ్వడాన్ని, రాష్ట్రంలో పరిస్ధితులపై మనసు విప్పి మాట్లాడుకోవడాన్ని ఇరు పార్టీల శ్రేణులూ కూడా స్వాగతిస్తున్నాయంటేనే రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనపై ప్రజలలో ఉన్న వ్యతిరేకత అవగతమౌతుంది. అయితే మరో వైపు జగన్ పూర్తిగా కేంద్రంలోని మోడీ సర్కార్ కు దాసోహం అయిపోయారు. బీజేపీ అధినాయకత్వం తానా అంటే తందానా అంటున్నారు. అందుకు కారణమేమిటంటే.. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ తన దుర్మార్గ పాలనతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అయితే మరొక్క చాన్స్ తనకు దక్కితే ఇక ఎదురే ఉండదన్న భావనతో ఉన్నారు. 2019 ఎన్నికలలో అధికారాన్ని నిలుపుకోగలిగితే.. ఆ తరువాత ఎన్నికల సమయానికి చంద్రబాబు వయసు రీత్యా ప్రత్యక్ష రాజకీయాలలో చురుకుగా పాల్గొనే అవకాశం ఉండదన్నది జగన్ భావన. అందు వల్ల ఈ సారికి ఎలాగైనా అధికారం నిలుపుకుంటే.. ఇక తిరుగుండదన్న భావనలో ఉన్నారు. అందుకే ఇటీవల సమీక్షల్లో కూడా ఆయన పార్టీ శ్రేణులకు ఇదే చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో విజయం సాధిస్తే ముఫ్ఫై ఏళ్ల పాటు మనదే అధికారం అంటూ వారిలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నారు.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మరో చాన్స్ మామూలుగా అయితే కష్టమన్న ఉద్దేశంతో ఆయన కేంద్రంలోని మోడీ సర్కార్ ను శరణు జొచ్చారు. మోడీ సర్కార్, బీజేపీ అండతో రానున్న ఎన్నికల గండాన్ని దాటేస్తే.. రాష్ట్రంలో ఇక ఎదురుండదు కనుక అప్పుడు అవసరమైతే రాష్ట్రలో తన వల్ల ఇప్పుడు బలోపేతంగా కనిపిస్తున్న బీజేపీని నిర్వీర్యం చేయవచ్చని ఆయన యోచిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించడం వల్లనే.. బీజేపీ మెంటార్ గా చెప్పబడే ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగిందని చెబుతున్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ పోకడలు నచ్చని ఆర్ఎస్ఎస్ వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనే వైసీపీ విజయం సాధించకూడదన్న భావనకు రావడం వల్లనే తెలుగుదేశం, జనసేనల మధ్య సయోధ్యకు మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చిందని పరిశీలకులు అంటున్నారు.రాష్ట్రంలో జగన్ సర్కార్ హిందుత్వ వ్యతిరేక పోకడలు, వైసీపీ హయాంలో దేవాలయాలపై దాడులు, పవిత్ర తిరుమలలో అన్యమత ప్రచారం వంటి సంఘటనల పట్ల ఆర్ఎస్ఎస్ తీవ్ర ఆగ్రహంతో ఉందని అంటున్నారు. అంతే కాకుండా.. తిరుమల పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార క్షేత్రంగా, ఒక ఆదాయవనరుగా భావిస్తూ.. కొండపై ఉన్న వసతి గృహాలలో రూము రెంట్ ను ఏకంగా ఒకేసారి రెండు రెట్లు అంతకంటే ఎక్కువగా పెంచడాన్ని కూడా ఆర్ఎస్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేనల మధ్య అవగాహన ఒక్కటే మార్గమన్న భావనతోనే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేనానితో ఉన్న పరిచయాలను పురస్కరించుకుని ఆయన చంద్రబాబు నివాసానికి వెళ్లేలా ప్రోత్సహించిందని చెబుతున్నారు.ఇరు పార్టీల మధ్యా సయోధ్య, అవగాహన తదితర అంశాలను పరిశీలించిన అనంతరం బీజేపీ స్టాండ్ ఏమిటన్నది తాము తేలుస్తామని ఆర్ఎస్ఎస్ పవన్ కల్యాణ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే మొదట్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తాను అని చెప్పిన పవన్ కల్యాణ్ ఆ తరువాత స్టాండ్ మార్చుకున్నట్లు కనిపించినా ఆర్ఎస్ఎస్ ఒత్తిడితో వెనక్కు తగ్గి ఓటు చీలనివ్వనన్న స్టాండ్ ను పునరుద్ఘాటించారని చెబుతున్నారు. అందుకే చంద్రబాబుతో చర్చలలో ఇరు పార్టీల ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారని అంటున్నారు. జగన్ పాలనకు చరమగీతం అన్న ఏకైక అజెడాతో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పటి దాకా వేటికవే వేర్వేరుగా ప్రజాక్షేత్రంలో పోరాడుతూ వచ్చినా ఇక ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలన్న నిర్ణయానికి రావడం వెనుక. జీవో నంబర్ 1 తో పాటుగా బీజేపీ మెంటార్ ఆర్ఎస్ఎస్ ప్రమేయం కూడా ఉందని చెబుతున్నారు.