శ్రీకాకుళం, జనవరి 10
ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకూ అనుమతి లభించలేదు. పోలీసులు అనుమతిస్తారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారు కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు హాజరవుతారు. వారిని కట్టడి చేయడం సాధ్యం కాదని పోలీసులు చెబుతున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే పార్టీ కార్యకర్తలను ఆహ్వానించాలని పోలీసులు కోరుతున్నారు. సంక్రాంతి పండగకు ముందు కావడంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్దయెత్తున ప్రజలు వచ్చే అవకాశముంది.అయితే ఇది పార్టీ కార్యకర్తల కోసం యువత కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కావడంతో పెద్దయెత్తున యువత వచ్చే అవకాశముంది. యువతతో పాటు మత్స్యకారులు కూడా పెద్దయెత్తున పాల్గొననున్నారు. ఇది బహిరంగ సభతో పాటు యువత నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ వినతులను స్వీకరిస్తారు. తమ సమస్యలను వివరించాలని, ఇందుకు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని పార్టీ అధినాయకత్వం తెలిపింది. దీంతో పవన్ కల్యాణ్ ను చూసేందుకు పెద్దయెత్తున యువకులు తరలివస్తారన్న అంచనాలు వినపడుతున్నాయి. ఈ సమావేశంలో మాట్లాడేందుకు వంద మంది యువతకు అవకాశం కూడా ఇవ్వనున్నారు. అయితే పోలీసులు ఇంత వరకూ ఈ సభకు అనుమతి ఇవ్వలేదు. అయితే జీవో నెంబరు 1 ప్రకారం గ్రౌండ్స్ లో సభను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదైనా ఆడిటోరియలోను కూడా ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకునే వీలుంది. జీవో నెంబరు 1 ప్రకారమే జనసేన అధినేతలు సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే విశాఖ ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత పవన్ కల్యాణ్ కు ఎలాంటి రోడ్ షోలకు అనుమతివ్వకపోవచ్చు. ఇప్పటికే ఈ విషయాన్ని జనసేన స్థానిక నేతలకు పోలీసులు చెప్పినట్లు తెలిసింది.ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను జనసేన నేతలు చేసుకుంటున్నారు. సహజంగా పవన్ కల్యాణ్ తన వాహనంపైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేయడం అలవాటు. కానీ ఈసారి విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లే పవన్ ఎక్కడా వాహనంపైకి ఎక్కేందుకు వీలు లేదు. మరి పవన్ కల్యాణ్ అభిమానులు ఆయన కన్పించడం కోసం దారి పొడవునా వెయిట్ చేస్తారు. వారందరికీ కన్పించేలా పవన్ ఎలా ప్లాన్ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం మీద మరో నాలుగు రోజుల్లో రణస్థలంలో జరిగే యువశక్తి సమావేశం పై ఉత్కంఠ నేటికీ కొనసాగుతుంది.