ప్రభుత్వ సక్సెస్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదివిన విద్యార్థులకు పది తరువాత ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియం లేకపోవడంతో వారు ఇంటర్ చదువుల కోసం మళ్లీ ప్రైవేట్ కళాశాలలను ఆశ్రయించాల్సి వస్తోంది. సక్సెస్ పాఠశాలల్లో పదో తరగతి ఇంగ్లీష్ మీడియం చదివి ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ కళాశాలల్లో చదివే స్థోమత లేని విద్యార్థులు ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలోనే చదవాల్సిన దుస్థితి నెలకొంది.
ఒకవైపు ఇంగ్లీష్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి పదో తరగతి వరకు తెలుగు మీడియం చదివిన విద్యార్థులు ఇంటర్‌ను కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవడానికే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంగ్లీష్ మీడియానికి పెరుగుతున్న ఆదరణను గుర్తించి ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ప్రారంభిస్తే ఎంతో మంది గ్రామీణ పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంగ్లీష్‌లో విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
జిల్లాలో ప్రతి ఏటా 12 వేల మంది వరకు విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. వారిలో సగం మంది వరకు విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులే ఉంటున్నారు. 2017 - 18 విద్యా సంవత్సరంలో జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో కలిపి మొత్తం 12,907 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా, వారిలో 9,731 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 4 వేల మందికి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివిన విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2008-09 సంవత్సరం నుంచి ప్రభుత్వం ‘సక్సెస్’ పేరిట ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ప్రారంభించింది. 6 నుంచి పదో తరగతుల వరకు ఇంగీష్ మీడియంలో విద్యా బోధన చేస్తున్నారు. సక్సెస్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివిన విద్యార్థులు తొలిసారిగా 2014లో పదో తరగతి పరీక్షలు రాశారు. సక్సెస్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివిన విద్యార్థులు తమ ఇంటర్ చదువుల ఇంగ్లీష్ మీడియంలోనే కొనసాగించేందుకు వీలుగా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయకపోవడం సక్సెస్ విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటి వరకు అయిదు బ్యాచ్‌ల సక్సెస్ విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాశారు.
పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆపై చదువులు ప్రభుత్వ కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివే అవకాశం లేదు. ఫలితంగా పదో తరగతి పూర్తి చేసుకున్న సక్సెస్ విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే ప్రైవేట్ కళాశాలల్లో చేరాల్సిన పరిస్థితి. లేదంటే గురుకుల, సాంఘిక సంక్షేమ, గిరిజన, ఝమైనారిటీ, మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలల్లో సీటు సాధిస్తేనే తక్కువ ఖర్చుతో ఇంటర్ చదువుకునే అవకాశం ఉంది. వేలాది రూపాయలు ఖర్చు చేయలేని తల్లిదండ్రులు తెలుగు మీడియంలో తమ పిల్లల చదువులు కొనసాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఆర్థిక స్థోమత సహకరించని విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో చదవాలనే ఆకాంక్ష ఉన్నా తప్పని పరిస్థితుల్లో తెలుగు మీడియంలో చేరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని 18 మండలాల్లో తొమ్మిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ఈ కళాశాలల్లోనూ కేవలం తెలుగు మీడియంలోనే విద్యా బోధన చేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన చేస్తే సక్సెస్ విద్యార్థులు ఇంటర్ చదువులు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.