YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీఆర్ఎస్ తొలి జాతీయ బహిరంగ సభ

బీఆర్ఎస్ తొలి జాతీయ బహిరంగ సభ

హైదరాబాద్ ,జనవరి 16 
2 రోజులే మిగిలి ఉంది.. దారులన్నీ అటు వైపు కదలాలి.. ఖమ్మం అంతా గులాబీ మయం కావాలి.. 18న జరిగే సభతో బీఆర్ఎస్ సత్తా చాటాలి. ఇదీ.. కారు పార్టీ వ్యూహం. పక్కా ప్రణాళికతో సభ ఏర్పాట్లు చేస్తోంది. ఖమ్మం జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ తొలుత జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కలెక్టరేట్ పక్కన 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ తొలి జాతీయ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ ఏర్పాట్ల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న మంత్రులు.. 18న జరిగే మీటింగ్ కోసం పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు.ఖమ్మంలోనే మకాం వేసిన మంత్రి హరీష్‌రావు భారీ జన సమీకరణలో భాగంగా నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇల్లందు వేదికగా బీఆర్ఎస్ పార్టీ మారే నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీష్ రావు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఛాన్స్‌ లేదన్న హరీష్‌రావు.. ఆ పార్టీలో చేరడం అంటే గోతి తవ్వుకోవడమేనని విమర్శించారు. బీజేపీలో చేరితే రాజకీయాల్లో ఆత్మహత్య చేసుకున్నట్లేనని చెప్పారు. సింగరేణి బొగ్గు గనులపై కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు బట్టారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. అలాగే సమన్వయంతో పనిచేసి ఇల్లందులో జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను విజయవంత చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశ చారిత్రాత్మక స‌భ‌కు ఖ‌మ్మం వేదిక కావ‌డం అదృష్టంగా ఉందని చెప్పారు మంత్రి హ‌రీశ్‌రావు.ఈ సభ ద్వారా బీజేపీ తీరును ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. జాతీయ పార్టీగా విస్తరించిన మాకు ఢిల్లీ, హైదరాబాద్, ఖమ్మం.. దేశంలో ఏ మూల అయినా ఒక్కటే అంటున్నారు. కేసీఆర్ ఒకరిని చూసి నేర్చుకోరు, అతన్ని చూసే వేరే వాళ్లు ఫాలో అవుతారు. తాము గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్తుంటే.. బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి గల్లీకి వస్తున్నారంటూ జగదీష్ రెడ్డి కామెంట్ చేశారు.ఖమ్మం సభకు ఐదు లక్షల మందిని తరలించి బీఆర్ఎస్ సత్తా చాటాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించేందుకు కసరత్తు చేస్తోంది. ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. మహబూబాబాద్ జిల్లా నుంచి లక్షా 20 వేల మందిని తరలించాలన్నది తమ లక్ష్యమంటున్నారు మంత్రి సత్యవతి రాథోడ్. మన ఇంట్లో వేడుక ఉంటే ఎలా పరుగులు పెడుతూ పనిచేస్తామో.. అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలంటూ కార్యకర్తలు, నేతలకు ఆమె పిలుపునిచ్చారు. ఇదిలాఉంటే.. ఖమ్మం సభకు కేరళ, ఢిల్లీ సీఎంలతో పాటు యుపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హాజరుకాబోతున్నారు.
ఖమ్మం సభకు గైర్హాజరు..!
బీఆర్ఎస్ ఖమ్మం పట్టణం వేదికగా నిర్వహిస్తున్న తొలి 'పాన్ ఇండియా' సభకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గైర్హాజరు కానున్నారు. బీఆర్ఎస్ ఫస్ట్ ఆఫీసును ఢిల్లీలో డిసెంబరు 14న ఓపెన్ చేసినప్పుడు ఆ పార్టీ నేతలంతా వెళ్ళారు. కానీ ఇన్వెస్టర్ మీటింగ్ ఉందన్న కారణంతో కేటీఆర్ దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు రిటైర్డ్ బ్యూరోక్రాట్లను చేర్చుకుని అక్కడి స్టేట్ యూనిట్‌ను ప్రారంభించిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశానికి కూడా కేటీఆర్ దూరంగానే ఉన్నారు. బీఆర్ఎస్ తరఫున ఇతర రాష్ట్రాల్లో యూనిట్ ఏర్పాటు కావడం ఇదే ఫస్ట్ టైమ్. పార్టీ అధినేత కేసీఆర్ తర్వాత 'నెంబర్ టూ' గా ఉన్న కేటీఆర్ ఈ రెండు ముఖ్య కార్యక్రమాలకు వేర్వేరు కారణాలతో గైర్హాజరు కావడం పార్టీలోనే చర్చకు దారితీసింది.ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్ల పార్టీ పేర్కొన్నా.. దావోస్ సదస్సుకు హాజరయ్యే పేరుతో స్విట్జర్లాండ్ టూర్‌కు వెళ్ళారు. ఈ నెల 20వ తేదీ వరకు అక్కడ షెడ్యూలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఖమ్మం సభకు ఆయన హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. వరుసగా మూడో కార్యక్రమం కేటీఆర్ లేకుండానే జరిగిపోతున్నది.

Related Posts