ఏలూరు, జనవరి 18,
ఇంఛార్జ్ పీవీఎల్‌పై కేడర్‌లో వ్యతిరేకత
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా ఉంది ఉండి నియోజకవర్గ వైసీపీ పరిస్థితి. ఉండిపై వైసీపీకి పట్టు చిక్కడం లేదు. అధికారపార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలే దీనికి కారణమనేది ఓపెన్ టాక్. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడారు నరసింహారాజు. కొన్నాళ్లూ పీవీఎల్లే ఉండి వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నప్పటికీ తర్వాత ఆయన్ను తప్పించి మరో నాయకుడు గోకరాజు రామరాజుకు పార్టీ పగ్గాలు ఇచ్చారు. అయినప్పటికీ వర్గపోరు తగ్గలేదు. భూమి గుండ్రంగా ఉన్నట్టు మళ్లీ ఇంఛార్జ్‌గా పీవీఎల్లే వచ్చారు. అయితే ఆయన నాయకత్వంలో పని చేసేందుకు స్థానిక వైసీపీ నాయకులు ఒప్పుకోవడం లేదట.పీవీఎల్‌ను గ్రామాల్లోకి రావొద్దని సొంత పార్టీ నేతలే నినాదాలు చేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గ్రూపులుగా ఏర్పడి రోడ్డెక్కుతున్నారు. పాలకోడేరులో పింఛన్ల పంపిణీకి వెళ్లిన నడిరోడ్డుమీద నిలబెట్టి గోబ్యాక్ అని కలకలం రేపారు. చేసేది లేక అక్కడి నుంచి పీవీఎల్ వెళ్లిపోయారు. ఇప్పటికే రెండుసార్లు అభ్యర్థుల్ని, ఇంఛార్జులను మార్చిన వైసీపీ అధిష్ఠానంపై మళ్లీ మార్పులు చేయాలని లోకల్ కేడర్ ఒత్తిడి పెంచుతోందట. ఉండిలో టీడీపీ కోటను కూల్చాలంటే పీవీఎల్ కంటే బలమైన అభ్యర్థి కావాలని స్వరం పెంచుతున్నారట. PVL వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తే.. ఆయన అందరినీ కలుపుకొని వెళ్లడం లేదని.. గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని కేడర్ కయ్‌మంటోంది. వచ్చే ఎన్నికల్లోనూ పీవీఎల్లే అభ్యర్థి అయితే ఓటమి తప్పదని హెచ్చరిస్తోందట కేడర్.పార్టీ కార్యక్రమాల వివరాలు చెప్పడం లేదని.. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణపై స్థానిక నేతలకు సమాచారం ఇవ్వడం లేదని.. గతంలో ఇచ్చిన వారికే మళ్లీ పదవులు కట్టబెడుతున్నారని పీవీఎల్ నరసింహారాజుపై ఉండి వైసీపీ నేతలు కుత కుతలాడుతున్నారట. వైసీపీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం కల్పించేలా.. అందరినీ కలుపుకొని వెళ్లేలా చొరవ తీసుకునే వాళ్లకే పార్టీ ఇంఛార్జ్ పగ్గాలు ఇవ్వాలని కొందరు నేతలు సూచిస్తున్నారట. మరి.. ఈ అంశాన్ని అధికారపార్టీ పెద్దలు గుర్తించారో లేదో కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు దిగజారుతున్నాయని ఆందోళన చెందుతున్నాయట శ్రేణులు. మరి.. ఉండి వైసీపీలోని సమస్యలను పరిష్కరించేందుకు అధిష్ఠానం ఏం చేస్తుందో చూడాలి.