విజయవాడ, జనవరి 19,
సంక్రాంతి సీజన్ ను ఏ.పి.ఎస్.ఆర్.టి.సి క్యాష్ చేసుకుంది. అదనపు ఛార్జీలు లేకుండానే ఈ ఏడాది ఆర్టీసీ ఆదాయం పెరిగింది. 50శాతం ఛార్జీల భారం ప్రయాణీకులపై పడకుండా చేయటంతో ఆదరణ పెరిగిందని ఏ.పి.ఎస్ ఆర్.టి.సి ఛైర్మన్ ద్వారకా తిరుమలరావు చెప్పారు.సంక్రాంతికి ముందు రోజుల్లో జనవరి 6 నుండి 14వ తేదీ వరకు ఏపీఎస్ ఆర్టీసీ రికార్డు స్థాయిలో 3,392 ప్రత్యేక బస్సులు నడిపింది. సంక్రాంతికి ముందు రోజుల్లో 3120 ప్రత్యేక బస్సులను నడపాలని యోచిస్తున్నట్లు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి 16 వతేదీన ప్రకటన జారీ చేసింది. సాధారణ ఛార్జీలకే తగిన సంఖ్యలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండటంతో ఏపీ, తెలంగాణ, తదితర ప్రాంతాల ప్రజలు ప్రైవేట్ బస్సుల కంటే, ఏపీఎస్ఆర్టీసీ బస్సులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. తిరుగు ప్రయాణ టిక్కెట్ ఛార్జీపై 10శాతం రాయితీ సౌకర్యం కూడా ప్రయాణికులన ఆర్టీసీ వైపు ఆకర్షించేలా చేసిందని ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.సంవత్సరం ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి ముందు రోజుల్లో 2,400 ప్రత్యేక బస్సులను నడిపిందని చెప్పారు. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సాధారణ ఛార్జీలు వసూలు చేయడం వల్ల ప్రయాణికులు ఇతర వాహనాలను ఆశ్రయించకుండా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సులకే ఎక్కువ మొగ్గు చూపారని అధికారులు చెబుతున్నారు. దీని ఫలితంగా ఆర్టీసీ స్థూల ఆదాయం బాగా పెరిగిందని అన్నారు. గత సంవత్సరం సాధించిన ఆదాయం రూ . 7.17 కోట్లుతో పోలిస్తే, ఈ సంవత్సరం 50% అదనపు ఛార్జీలు లేకుండానే రూ. 7.90 కోట్ల ఆదాయాన్ని ఏ.పి.ఎస్.ఆర్.టి.సి ఆర్జించిందని తిరుమలరావు తెలిపారు. కాగా, గత ఏడాది ఇవే రోజుల్లో సాధించిన రూ.107 కోట్ల ఆదాయం కంటే ఈ సంవత్సరం రూ. 141 కోట్ల ఆదాయం ఏపీఎస్ ఆర్టీసీ సాధించగలిగిందని ఏ.పి.ఎస్.ఆర్.టి.సి మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.ఏ.పి.ఎస్.ఆర్.టి.సి గత ఏడాది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు 824 బస్సులు నడపగా, ఈ సంవత్సరం 1,483 ప్రత్యేక బస్సులను నడిపిందని చెప్పారు. హైదరాబాద్ లో సరైన మౌలిక సదుపాయాలు లేనప్పటికీ పెద్ద ఎత్తున బస్సులు నడిపి, ప్రయాణికుల నుండి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ప్రత్యేక సర్వీసులను నిర్వహించిన ఘటన ఏ.పి.ఎస్.ఆర్.టి.సి కి దక్కిందని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇతర రాష్ట్రాలకు వెళ్లే తిరుగు ప్రయాణికుల కోసం రద్దీని బట్టి ముందస్తు సీట్ల రిజర్వేషన్ కల్పిస్తూ, బస్సులు నిరంతరం అందుబాటులో ఉంచటం వలన ప్రయాణీకులు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి కి ఆకర్షితులు అయ్యారని అన్నారు.సంక్రాంతి ముందు రోజుల్లో ఏపీఎస్ ఆర్టీసీ సేవలను విశేషంగా ఆదరించినందుకు ప్రయాణికులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ అంతటా అన్ని ప్రదేశాల నుండి తగిన సంఖ్యలో తిరుగు ప్రయాణం కోసం ఏపీఎస్ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసినందున ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను ఆదరించి సంస్ద అందించే సేవలను పొందడం భవిష్యత్ లో కూడ కొనసాగించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నామని ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు.