YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

క్యాట్ పైనే ఐఏఎస్ అధికారులు

క్యాట్ పైనే  ఐఏఎస్ అధికారులు

విజయవాడ, జనవరి 19, 
రాష్ట్ర విభజన సమయంలో ఐఏఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందుకోసం కోసం ప్రత్యేక కమిటీని వేసి.. ఆ కమిటీ సూచనల ప్రకారం కేటాయింపులు చేశారు. అయితే ఏపీకి వెళ్లాల్సిన కొందరు ఐఏఎస్ అధికారులు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌.. క్యాట్‌ను ఆశ్రయించారు. దాంతో క్యాట్‌లో పిటిషన్‌ వేసిన ఆఫీసర్లకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ఇదే విధంగా తెలంగాణకు వెళ్లాల్సిన అధికారులు సైతం వెళ్లకుండా క్యాట్‌ను వెళ్లి ఏపీలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరహా పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం, DOPT హైకోర్టులో సవాల్‌ చేసింది. మొత్తం15 మంది ఐఏఎస్, ఐపీఎస్ లపై కోర్టులో విచారణ జరుగుతోంది.ఇటీవల సీనియర్ ఐఏఎస్ సోమేష్‌కుమార్‌ విషయంలో హైకోర్టులో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అప్పీలుకు వెసులుబాటు చిక్కలేదు. తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే సోమేష్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాలని DOPT కూడా ఆదేశాలు జారీ చేసింది. దాంతో సోమేష్‌కుమార్‌ ఏపీకి వెళ్లక తప్పలేదు. ఇప్పుడు మిగతా అధికారులపై ఫోకస్‌ మళ్లింది. వారి సంగతి ఏంటి అని చర్చిస్తున్నారు. ఆ అధికారులు కూడా వెళ్లక తప్పదనే అభిప్రాయం అధికారవర్గాల్లో ఉంది.సోమేష్‌ కుమార్‌ కాకుండా తెలంగాణలో పనిచేస్తున్న మరో ఐదుగురు IASలు ఏపీకి వెళ్లాల్సింది ఉంది. వారిలో వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, రోనాల్డ్‌రాస్‌, ప్రశాంతి, ఆమ్రపాలి ఉన్నారు. వీరిలో వాకాటి కరుణ విద్యాశాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వాణి ప్రసాద్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సెక్రటరీగా పనిచేసి ప్రస్తుతం ఉన్నారు. రోనాల్‌ రాస్‌ ఆర్థిక శాఖలో పనిచేస్తున్నారు. ప్రశాంతి అటవీశాఖలో ఉన్నారు. సోమేష్‌కుమార్‌ విషయంలో హైకోర్టు తీర్పు చూశాక.. తమ విషయంలోనూ అదే జరుగుతుందని ఈ అధికారులు అనుకుంటున్నారట. ఈ రోజు కాకున్నా.. రేపైనా ఏపీకి వెళ్లక తప్పదని మానసికంగా సిద్ధమైనట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసేది ఏమీ ఉండబోదని.. కోర్టు కేసులను అధికారులు వ్యక్తిగత హోదాలోనే ఎదుర్కోవాలి… కోర్టు ఖర్చులు సొంతంగానే భరించాలి. ఇప్పుడు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందనే నమ్మకం కూడా పోయిందని వాళ్లు అనుకుంటున్నారట. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ కేడర్‌ అధికారులు కూడా పెట్టేబేడా సిద్ధం చేసుకోవాల్సిందేనని సచివాలయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

Related Posts