అమరావతి జనవరి 20
జగన్ ప్రభుత్వానికి టీడీపీ షాక్ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వంఇంతవరకు 5వ ఫైనాన్స్ కమిషన్ ను నియమించలేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి హైకోర్టులో ఫిటిషన్ వేశారు. దీనిపై గురువారం విచారణ జరిగింది. ఫైనాన్స్ కమిషన్‌ను రెండు వారాల్లో నియమిస్తామని ఏపీ హైకోర్టు కు జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరిగిన సందర్భంగా మూడు నెలల్లో ఫైనాన్స్ కమిషన్‌ను నియమిస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది. అయితే మూడు నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఫైనాన్స్ కమిషన్‌ను నియమించలేదని జీవీ రెడ్డి తరఫున న్యాయవాది ఉమేష్ చంద్ర హైకోర్టులో వాదనలు వినిపించారు. దీని వలన నిధులు దారిమళ్లుతున్నాయని, అందువల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారిందని ఆయన వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ కమిషన్‌ను ఎందుకు నియమించలేదని ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. సమాధానంగా తాము ఫైనాన్స్ కమిషన్‌ను నియమించి ఆ ఫైల్‌ను గవర్నర్ వద్దకు పంపామని, అక్కడి నుంచి వచ్చిన వెంటనే ఫైనాన్స్ కమిషన్‌ను అమలు చేస్తామని న్యాయమూర్తికి చెప్పారు. రెండు వారాల్లో ఈ నియామక ప్రక్రియ పూర్తి అవుతుందని వివరించారు. దీంతో నాలుగు వారాల సమయం ఇస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి పేర్కొంటూ తదుపరి విచారణ ఫిబ్రవరికి వాయిదా వేశారు.