విజయవాడ, జనవరి 21,
డిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ఏపీ బీజేపీ తరపున సోము వీర్రాజు ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఎలా బలపడాలో చర్చలు జరిపారు. అయితే ఏపీ గురించి పెద్దగా చర్చ జరగలేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గురించి ప్రధాని మోదీ గొప్పగా చెప్పారు. కానీ సోము వీర్రాజు ప్రస్తావన చేయలేదు. ఏపీలో గెలుస్తామని..బలపడతామని కూడా చెప్పలేదు. అసలు పార్టీ స్ట్రాటజీ గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. దీంతో ఏపీ గురించి అసలు కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టలేదని .. జనసేనతో పొత్తులు కొనసాగించే ఆసక్తి కూడా చూపించడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఏపీలో పొత్తుల వల్ల ఎక్కువగా నష్టపోయామన్న భావన బీజేపీ నేతల్లో ఉంది. జనసేనతో పొత్తు పెట్టుకున్నా.. బీజేపీ మైనర్ భాగస్వామిగా ఉండాల్సి వస్తుంది. జాతీయ పార్టీగా ఇది ఆ పార్టీకి ఇబ్బందికరమే. అందుకే జనసేనతో పొత్తు విషయంలోనూ ఒత్తిడి చేయకూడదని.. భావిస్తున్నట్లుగా జాతీయ కార్యవర్గ సమావేశంలో సందేశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో పలుమార్లు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వలనే పార్టీ ఏపీలో ఎదగలేదనే అభిప్రాయంతో జాతీయ నాయకత్వం ఉంది. గత అనుభవాలను దృష్టి లో ఉంచుకొని జనసేనతో కలిసి పార్టీని పటిష్టం చేసుకోవాలని జాతీయ నాయకత్వం పలుమార్లు ఆలోచన చేసింది. అయితే ఇక్కడి పరిస్థితులను బట్టి టీడీపీతో పొత్తుకే పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్నట్లు రాష్ట్ర నేతలు జాతీయ నాయకత్వం అంచనాకు వచ్చింది. అందుకే జనసేనతోనూ పొత్తుల కోసం ఒత్తిడి చేయకూడదని భావిస్తున్నారు. రాష్ట్రంలోని రాజ కీయ పరిణామాలు, బీజేపీ నిర్వహిస్తున్న పాత్ర తదితర అంశాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. గతం నుంచే జనసేన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ పెద్దగా కలిసి కార్యక్రమాలు నిర్వహించింది లేదు. రాను రాను రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతున్న నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్య టన తర్వాత పరిస్థితి మారుతుందని అందరూ భావించారు. రెండు పార్టీల మధ్య దూరం తగ్గి ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టొచ్చని భావిస్తున్న తరుణంలో..రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి.అధికార పార్టీని గట్టిగా నిలువ రించాలనే కృతనిశ్చయంతో తెదేపా వైపే పవన్ మొగ్గు చూపుతున్నట్లు ఇప్పటం, రణస్థలం తదితర సమావేశాల్లో ఆయన చేస్తున్న ప్రకట నలను బట్టి స్పష్టమవుతోంది. బీజేపీ కూడా కలిసొస్తే బాగుం టుందనే అభిప్రాయం అటు జనసేన, ఇటు తేదేపా నేతల్లో ఉన్నప్పటికీ..జాతీయ నాయకత్వం మాత్రం అలాంటి ఆలోచనలు వద్దన్నట్లుగా ఉందని చెబుతున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో భీమవరంలో నిర్వహించ నున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో అధిష్టానం నిర్ణయం పై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీ.మురళీ ధరన్ మరింత స్పష్టత ఇవ్వనున్నారు. పొత్తులను పక్కనబెట్టి సొంత ఎదు గుదలపై దృష్టిసారించాలంటూ అధిష్టానం నుంచి స్పష్టత వచ్చినందున రెండు కుటుంబ పార్టీలకు దూ రమంటూ సోము వీర్రాజు ప్రకటించనట్లుగా తెలుస్తోంది. ఈ నెల 23, 24 తేదీల్లో భీమవరంలో నిర్వహించే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఏపీ బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. జాతీయ నాయకత్వం ఆలోచనను సైతం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి స్పష్టం చేయనున్నారు. అదే సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించనున్నారు.