శ్రీనగర్, జనవరి 23,
జమ్మూ కాశ్మీర్‌లో భారీగా మంచు మరియు వర్షం కురుస్తోంది. ఆదివారం నుంచి ఉత్తర కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో హిమపాతం ముంచెత్తింది. వాస్తవానికి జనవరి 19 నుంచి ఏడు రోజుల పాటు అడపాదడపా మంచు కురుస్తుందని, వర్షాలు కురుస్తాయని ముందుగా వాతావరణ శాఖ అంచనా వేసిన సంగతి తెలిసిందే.. అయితే జనవరి 29 వరకు భారీ హిమపాతం కురిసే అవకాశం ఉందని.. ప్రజల అప్రమత్తంగా ఉండాలని తాజాగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో జమ్ముకశ్మీర్‌లో ఏం జరగబోతోంది..? ఈసారి సంభవించే మంచు తుఫాన్ పెను విపత్తును సృష్టించనుందా..? డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వార్నింగ్ దేనికి సంకేతం అంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.వాతావరణ శాఖా ముందస్తు హెచ్చరికతో జమ్ముకాశ్మీర్‌లో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించనున్నట్లు తెలుస్తోంది. రాబోయే 24 గంటల్లో భారీ హిమపాతం రాష్ట్రంలోని పలుజిల్లాలను అతలాకుతలం చేయనుంది జమ్ము కశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వార్నింగ్ ఇచ్చింది. జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా, గందర్‌బల్, దోడా, పూంచ్, రాంబన్, బందిపూర్, కుప్వారాజిల్లాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించింది. వీటిలో బారాముల్లా, గందర్‌బల్‌జిల్లాలో కాస్తా తక్కువగానే హిమపాతం ప్రభావం ఉన్నా, దోడా, పూంచ్, రాంబన్, బందిపూర్, కుప్వారాజిల్లాలో పరిస్థితి బీభత్సంగా ఉంటుందని వెల్లడించింది.మంచు తుఫాన్ ప్రభావంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జమ్ముకశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటి సూచించింది. తాము సూచించిన ప్రాంతాలకు దూరంగా వెళ్లాలని తెలిపింది. లేదంటే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. గతంలో ఎన్నడూలేని విధంగా మంచు తుఫాన్ జమ్ముకశ్మీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, తమ హెచ్చరికను తేలికగా తీసుకోవద్దని తెలిపింది.మరోవైపు జమ్ముకశ్మీర్‌లో విపరీతమైన స్నోఫాల్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. కొన్నిచోట్ల స్కూల్స్‌కి సెలవు ప్రకటించారు. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులపై మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మంచుతుఫాన్ నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా పలు చర్యలు చేపట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.