చెన్నై, జనవరి 24,
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి పూర్తిగా చదవకుండా, కొన్ని అంశాలను మార్చి చదవడంతో తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై అధికార డీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో గవర్నర్‌పై విరుచుకుపడ్డారు. తమిళనాడు ప్రభావం కేరళపై పడినట్లు కనిపిస్తోంది. తాజాగా కేరళ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాజభవన్ లో ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రసంగించారు. ఐతే ముందుగానే కేరళ రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగాన్ని అక్షరం పొల్లు పోకుండా చదివి వినిపించారు. కేరళలో కూడా గవర్నర్ మీద ఆ రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషి కొనసాగిస్తుందనే ఆరోపణలు లేకపోలేదు. ఈ క్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ ఆరిఫ్ పూర్తిగా చదవి అందరినీ ఆశ్చర్యపరిచారు.రాష్ట్ర రుణ పరిమితులను తగ్గించడం, రాష్ట్రాల చట్టసభల పరిధిలోకి ప్రవేశించడం, రాష్ట్ర రుణ పరిమితుల పరిమితుల్లో ఆదాయ, వ్యయ రుణాలను చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గవర్నర్ తన ప్రసంగంలో విమర్శించారు. పత్రికా స్వేచ్ఛపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ఆందోళనను ఆరిఫ్ ఎత్తిచూపారు. దేశంలో పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్న కొన్ని కేసులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఐతే ఈ ప్రసంగంలో ఎక్కడా ప్రభుత్వంతో తనకు ఉన్న విబేధాలను గవర్నర్ కనబరచకపోవడం కొసమెరుపు. ప్రసంగంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై పినరయి ప్రభుత్వం పేర్కొన్న విమర్శల్ని సైతం ఆయన చదివి వినిపించారు. ఈ మేరకు గవర్నర్ ప్రసంగం మొత్తం చదివి వినిపించడం వెనుక తమిళనాడు ప్రభావం ఉందేమోనని గుసగుసలు వినిపిస్తున్నాయి.