కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి అంతా మా ఇష్టం అన్న చందంగా రహదారి పనులు చేస్తూ సొమ్మును రోడ్డు పాల్జేస్తున్నారు. మండలంలోని రత్నాపురం-అల్లిగూడెం మధ్య నిర్మిస్తున్న రహదారి. ఈ గ్రామాల మధ్య 1.3 కోట్ల రూపాయలతో 4.8 కిమీ మేర రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఒక కాంట్రాక్టరు ఈ పనులు దక్కించుకున్నాడు. దీంట్లో సుమారు ఒక కిమీ ప్రాంతం రిజర్వు ఫారెస్టులో ఉంది. ఈ ప్రాంతంలో రహదారి నిర్మించాలంటే తప్పనిసరిగా అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. రిజర్వు ఫారెస్టు ఉన్న ఈ ప్రాంతంలో రహదారి నిర్మించేందుకు సదరు కాంట్రాక్టరు అనుమతి కోరుతూ అటవీశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. కాని అటవీశాఖ నుండి ఎటువంటి అనుమతులు రాకుండానే కాంట్రాక్టరు రహదారి నిర్మాణ పనులు ప్రారంభించారు. రిజర్వు ఫారెస్టు ఉన్న ప్రాంతం వరకు నాణ్యతకు తిలోదకాలిస్తూ తుతు మంత్రంగా పనులు చేపట్టారని ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణంలో గ్రావెల్ వేయాల్సి ఉండగా గ్రావెల్‌తో పాటు పెద్దపెద్ద రాళ్లను రహదారి నిర్మాణానికి ఉపయోగించినట్టు స్థానికులు చెబుతున్నారు. అలాగే రహదారిని రోలింగ్ చేయకపోవడంతో రోడ్డంతా ఎత్తుపల్లాలుగా మారి ప్రయాణం కష్టంగా మారింది. మొనతేరిన రాళ్లు, గుంతలమయంగా ఉన్న ఈ రహదారి పనులు చూసి గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణ పనులను చింతూరు ఐటీడీఏ పీవో అభిషిక్త్ కిశోర్ పర్యవేక్షించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టరును తక్షణమే తనను కలవాలని అధికారులను ఆదేశించారు. కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ రహదారి నిర్మాణంలో కాంట్రాక్టరు ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తున్నట్టు తెలుస్తోంది. గ్రావెల్ రోడ్డు పనులు చేపట్టే సమయంలో గ్రావెల్‌ను తోలి కుప్పలుగా పేర్చాలని, అనంతరం ఆ గ్రావెల్‌ను అధికారులకు చూపించి అధికారులు అనుమతి ఇచ్చిన తరువాతే దానిని రహదారి పనులకు వినియోగించాలి. కాని కాంట్రాక్టరు ఆ విధంగా చేయకుండా పనులు చేపట్టినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. కాని కాంట్రాక్టరు, అధికారులు కుమ్మక్కై ఈ విధంగా రహదారి పనులు చేస్తున్నారని ఆ గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి నిర్మాణం నాణ్యతగా ఉండేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.