YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జోషిమఠ్‌లో 863 భవనాలు పగుళ్లు

జోషిమఠ్‌లో  863 భవనాలు పగుళ్లు

డెహ్రాడూన్, జనవరి 25, 
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని జోషిమఠ్‌లో ఇప్పటి వరకు 863 భవనాలు పగుళ్లు ఏర్పడాయని, వాటిలో 181 అన్‌సేఫ్ జోన్‌లో ఉన్నాయని జోషిమఠ్ జిల్లా మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా తెలిపారు.  ఇప్పటివరకు 863 భవనాలలో పగుళ్లను జిల్లా యంత్రాంగం గుర్తించిందన్నారు. జోషిమఠ్ లో భూమి కుంగిపోవడం వల్ల పగుళ్లు వస్తున్నాయని, ఇందులో 181 భవనాలను అన్‌ సేఫ్ జోన్‌లో ఉన్నాయని తెలిపారు. ఢాకా గ్రామంలో కుంగిపోయిన ప్రాంతాలను జిల్లా మేజిస్ట్రేట్ పరిశీలించారు. అనంతరం ఓ ప్రకటన చేశారు. ఈ ప్రాంతం  కాంటూర్ మ్యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా మేజిస్ట్రేట్ ఆర్‌డబ్ల్యుడీని ఆదేశించారు. బాధిత ప్రజల నుంచి సలహాలను తీసుకున్న తర్వాత, ప్రజల తరలింపుపై ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. శనివారం జోషిమఠ్ లో వాతావరణం అనుకూలించడంతో  భవనాల కూల్చివేత పనులు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు.  జేపీ కాలనీ సమీపంలో నీటి విడుదలను 136 ఎల్‌పీఎమ్‌లకు తగ్గించినట్లు అధికారులు తెలిపారు. జేపీ కాలనీకి నీటి విడుదల మొదట్లో 540 ఎల్‌పీఎమ్‌గా ఉంది. ఇది గణనీయంగా తగ్గడం సానుకూల సంకేతం అని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ రంజిత్ కుమార్ సిన్హా తెలిపారు. మంచు భారీగా కురుస్తుడడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శుక్రవారం కూల్చివేత నిలిపివేశామన్నారు. భారీగా మంచు కురుస్తుండడం వల్ల తాత్కాలిక సహాయ శిబిరాల్లో నివసిస్తున్న ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జోషిమఠ్‌లోని బాధిత ప్రజలకు సహాయం అందిస్తున్నామని సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.  ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలోని హిమాయాల ఏటవాలు ప్రాంతంలో కట్టిన గ్రామం జోషి మఠ్ తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ కొండచరియలు విరిగిపడటం కలవరపాటుకు గురి చేస్తోంది. జోషిమఠ్ నుండి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సెలాంగ్ గ్రామం పరిస్థితి కూడా దాదాపు జోషి మఠ్ లాగానే ఉంది. సెలాంగ్ గ్రామంలోనూ పలు ఇళ్లు, భూమిలో పగుళ్లు రావడం మొదలైంది. జోషిమఠ్ లోని పరిస్థితులను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా గ్రామంలో పగుళ్లు రావడం, కుంగిపోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. బద్రీనాథ్ జాతీయ రహదారి పై ఉన్న సెలాంగ్ గ్రామస్తులు జోషి మఠ్ తరువాత తమ ప్రాంతం అలాగే అవుతుందని తాము భయపడ్డామని చెప్పారు. జోషిమఠ్ సంక్షోభం వారి భయాన్ని మరింత పెంచినట్లు కనిపిస్తోంది. తమ దుస్థితికి ఎన్‌టీపీసీ తపోవన్‌- విష్ణుగర్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టులే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సెలాంగ్ గ్రామానికి చెందిన విజేందర్ లాల్ పీటీఐతో మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ కు సంబంధించిన సొరంగాలు గ్రామం కింద నుంచి నిర్మించారని.. ఈ సొరంగాలలో ఒకదాని ముఖద్వారం సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న ఒక హోటల్ జూలై 2021లో కూలిపోయిందని ఆయన తెలిపారు. దాని సమీపంలోని పెట్రోల్ పంపు కూడా పాక్షికంగా దెబ్బతింది. పగుళ్లు రావడంతో ఇప్పుడు దీని ప్రభావం ఇళ్లపై కనిపిస్తోంది.

Related Posts