ముంబై, జనవరి 25,
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు పదవి నుంచి వైదొలగాలని ఉందంటూ ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేశారు. అయితే తాను రాజీనామా చేయబోతున్న విషయాన్ని.. ఇటీవల ముంబయి పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలిజేశానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "నేను అన్ని రాజకీయ పదవుల నుంచి వైదొలగాలనుకుంటున్నాను. నా శేష జీవితం అంతా రాయడం, చదవడం తో పాటు ఇతర కార్యకలాపాలతో గడపాలనేదే నా కోరిక" అని వెల్లడించారు. అలాగే మహారాష్ట్ర వంటి గొప్ప రాష్ట్రానికి తాను రాష్ట్ర సేవకుడిగా, గవర్నర్‌గా పని చేయడం తనకు చాలా సంతోషాన్ని, గౌరవాన్ని ఇచ్చిందని చెప్పారు. మూడేళ్లకు పైగా మహారాష్ట్ర ప్రజల నుండి లభించిన ప్రేమ, ఆప్యాయతలను తాను ఎప్పటికీ మరచిపోలేనని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి తనకు ఎప్పుడూ ప్రేమ, ఆప్యాయత లభిస్తూనే ఉంటాయని అన్నారు. అయితే గవర్నర్ చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలపై చాలా వివాదం నెలకొంది. తాజాగా ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై ఓ ప్రకటన చేశారు. ఆ ప్రకటన తర్వాత విపక్షాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ నేతల్లో కొందరు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వాస్తవానికి, ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత రోజులకు చిహ్నం అని గవర్నర్ కోశ్యారీ గతేడాది నవంబర్‌లో అన్నారు. రాష్ట్రంలోని ఐకాన్ల గురించి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలను ప్రస్తావించారు."ఇంతకు ముందు మీ ఐకాన్ ఎవరు అని అడిగినప్పుడు.. జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ అని సమాధానం వచ్చింది.. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత రోజులకు చిహ్నం" అని కోశ్యారీ చెప్పారు.దీనికి ముందు కూడా భగత్ సింగ్ కోశ్యారీ చేసిన ప్రకటనపై దుమారం రేగింది. 2022 జులైలో.. గుజరాతీలు మరియు రాజస్థానీలను మహారాష్ట్ర నుండి తొలగిస్తే, ముంబై దేశ ఆర్థిక రాజధాని హోదాను కోల్పోతుందని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై అన్ని పార్టీలు తీవ్రంగా స్పందించాయి. తరువాత, ముంబై అభివృద్ధిలో కొన్ని వర్గాల సహకారాన్ని మెచ్చుకోవడంలో నేను పొరపాటు చేశానని ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.