రాజమండ్రి, జనవరి 27,
టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన నేత మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ చుట్టు ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరూ రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసిన ప్రత్యర్థులు. ప్రస్తుతం రెండు పార్టీల మధ్య పొత్తులు చిగురించ వచ్చనే చర్చ సాగుతోంది. ఆ పొత్తులు పొడుస్తాయో లేదో కానీ.. ఈ ఇద్దరు నేతలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ అయితే ఉత్కంఠ రేపుతోంది.బుచ్చయ్య చౌదరి రాజమండ్రి సిటీ నుంచి నాలుగుసార్లు.. రాజమండ్రి రూరల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జనసేనతో పొత్తు ఉంటే రూరల్ సీటును విడిచిపెట్టి రాజానగరం వెళ్లాల్సి ఉంటుందని టీడీపీ పెద్దలు బుచ్చయ్య చౌదరికి చెప్పినట్టు తెలుస్తోంది. రాజానగరం టీడీపీ ఇంఛార్జ్ పదవికి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ రాజీనామా చేయడంతో.. అక్కడ సీటు ఖాళీగా ఉంది. అక్కడ బుచ్చయ్య చౌదరి అయితే సరిపోతారని టీడీపీ పెద్దలు అనుకుంటున్నారట. అయితే ఈ ప్రతిపాదనకు గోరంట్ల ససేమిరా అన్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తనకు రాజమండ్రి రూరల్ లేదా రాజమండ్రి సిటీ టికెట్ కేటాయించాలని మొహమాటం లేకుండా చెప్పేశారట.ఇక గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి జనసేన టికెట్‌పై పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌కు 35 వేల ఓట్లు వచ్చాయి. ఓడినా అప్పటి నుంచి ఇప్పటి వరకూ నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. కాపు సామాజికవర్గం నేత కావడంతో ఆయనపై పార్టీ ఆశలు పెట్టుకుంది. ఒకవేళ టీడీపీతో పొత్తు ఉంటే రూరల్ సీటును సైకిల్ పార్టీకి వదిలేయాల్సి వస్తుందనే చర్చ ఉంది. దాంతో దుర్గేష్‌ను రాజానగరం వెళ్లాలని జనసేన పెద్దలు చెప్పొచ్చనుకుంటున్నారు. ఈ ప్రతిపాదనకు దుర్గేష్ ఒప్పుకోవడం లేదట.గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్‌లో వైసిపి, జనసేన అభ్యర్థులు ఇద్దరు కాపు సామాజిక వర్గం వారే పోటీ చేశారు. కాపు ఓట్లు చీలిపోయాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ బీసీ నేత చందన నాగేశ్వరరావును బరిలో దించుతుందని అనుకుంటున్నారు. అదే జరిగితే రూరల్‌లో జనసేన గెలుస్తుందనే లెక్కలేస్తున్నారు. పైగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో దుర్గేష్ పోటీ పడటంవల్ల ఫలితం మరోలా రావొచ్చని చర్చ సాగుతోందట. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో జక్కంపూడి కుటుంబానికి సన్నిహిత సంబంధం ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ గణాంకాలపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.గోరంట్ల, కందుల ఇద్దరూ టీడీపీ, జనసేనలో కీలక నేతలు కావడంతో పొత్తుల సర్దుబాటులో సమీకరణాలు ఇబ్బందిగా మారతాయని అనుకుంటున్నారట. ఒకవేళ ఇద్దరూ రూరల్ సీటుకోసం పట్టుబడితే మొదటికే మోసం రావొచ్చని అనుకుంటున్నారట. అయితే తనకు రూరల్ కాకపోతే రాజమండ్రి సిటీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు గోరంట్ల. అక్కడ కూడా టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఉన్నారు. అది సాధ్యం కాకపోవచ్చు. దీంతో అధిష్ఠానం రాజానగరం వెళ్లాల్సిందే అని చెబితే బుచ్చయ్య చౌదరి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధ పడతారనే టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లోనూ వైసీపీ గాలిని తట్టుకుని పదివేలకుపైగా మెజారిటీ సాధించిన గోరంట్ల విషయంలో టీడీపీ ఏం చేస్తుందన్నదే ప్రశ్న. అలాగే జనసేన పెద్దలను దుర్గేష్ ఏ విధంగా ఒప్పిస్తారనేది చర్చే.