ముంబై, జనవరి 28,
మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ను నియమించే అవకాశం ఉందని సమాచారం. మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. కోశ్యారీ ఈ విషయాన్ని కేంద్రానికి తెలిపిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కోశ్యారీ...పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. తాను రాజీనామా చేయాలనుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేసినట్లు గవర్నర్ కోశ్యారీ ఇటీవల చెప్పారు. ప్రధాని మోదీ ఇటీవల ముంబయి పర్యటన సందర్భంగా తన అభిప్రాయాన్ని తెలియజేశానని గవర్నర్ కోశ్యారీ తెలిపారు. తాను అన్ని రాజకీయ బాధ్యతలను తప్పుకోవాలనుకుంటున్నానని, శేష జీవితాన్ని చదవడం, రాయడం ఇతర కార్యకలాపాలతో గడపాలని కోరుకుంటున్నట్లు ప్రధానికి తెలియజేశానన్నారు. ఈ మేరకు మహారాష్ట్ర రాజ్ భవన్ ను ఓ ప్రకటన విడుదల అయింది. గత సెప్టెంబర్‌లో అమరీందర్ సింగ్ స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను బీజేపీలో విలీనం చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన పార్టీని స్థాపించారు. నవంబర్ 2021లో పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ నియామించడంతో.. అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు భగత్ సింగ్ కోశ్యారీ ఇటీవల ఓ ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియజేశానని భగత్ సింగ్ కోశ్యారీ చెప్పారు. త్వరలోనే గవర్నర్ పదవికి కోశ్యారీ రాజీనామా చేయనున్నట్లు సమాచారం. దీంతో మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత అమరీందర్ సింగ్ ను నియమించే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి. చాలా ఏళ్లు కాంగ్రెస్‌లో కొనసాగిన కెప్టెన్ అమరీందర్ సింగ్, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి సొంతంగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో అమరీందర్ పార్టీ కనీసం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. పటీయాలా అర్బన్ నుంచి పోటీ చేసిన అమరీందర్ కూడా ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో 2022 సెప్టెంబర్‌లో బీజేపీలో చేరారు అమరీందర్. అనంతరం పంజాబ్ లోక్ కాంగ్రెస్ ను బీజేపీలో విలీనం చేశారు. మహారాష్ట్ర గవర్నర్‌గా భగత్ సింగ్ కోశ్యారీ సెప్టెంబర్ 2019లో బాధ్యతలు చేపట్టారు. తక్కువకాలంలోనే కోశ్యారీని అనేక వివాదాలు చుట్టుముట్టాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేవేంద్ర ఫడణవీస్‌తో తెల్లవారుజామునే ప్రమాణస్వీకారం చేయించడం, మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను తిరస్కరించడంతో తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఇటీవల మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీపై కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. శివాజీ పాతతరం నాయకుడంటూ గవర్నర్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనను వెంటనే రీకాల్ చేయాలని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతోపాటు ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. వరుస వివాదాలతో కోశ్యారీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.