YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వివేకా కేసులో ఫోన్ నెంబర్ల రచ్చ

వివేకా కేసులో ఫోన్ నెంబర్ల రచ్చ

హైదరాబాద్, ఫిబ్రవరి 1, 
ముఖ్యమంత్రి చిన్నాన్న వైఎస్‌.వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసు విచారణలో సిబిఐ వేగం పెంచింది. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి మొబైల్ నంబర్ నుంచి కాల్స్‌ వెళ్లినట్లు గుర్తించిన సిబిఐ అధికారులు ఆ నంబర్‌ ఎవరదని ఆరా తీస్తున్నారు. గత వారం అవినాష్‌ రెడ్డిని విచారించిన సమయంలో వెల్లడైన విషయాల ఆధారంగా ముఖ్యమంత్రి నివాసంలో ఉండే ఓ వ్యక్తి నంబరుకు పలుమార్లు ఫోన్లు చేసినట్లు గుర్తించారు.జనవరి 28న అవినాష్ రెడ్డి విచారణలో వివేకా హత్య తర్వాత ఎవరెవరితో మాట్లాడారనే విషయాలపై సిబిఐ ఆరా తీసింది. దాాదాపు నాలుగున్నర గంటల పాటు అవినాష్ రెడ్డిని సిబిఐ విచారించింది. తనకు తెలిసిన సమాచారం మొత్తాన్ని అవినాష్ రెడ్డి సిబిఐకు తెలియచేసినట్లు చెప్పారు. సిబిఐ విచారణలో అవినాష్ రెడ్డి కాల్‌డేటా ఆధారంగా ప్రశ్నించడంతో మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి.వివేకా హత్య తర్వాత నవీన్ అనే వ్యక్తి పేరుతో ఉన్న ఫోన్ నంబరుతో అవినాష్ రెడ్డి పలుమార్లు మాట్లాడినిట్లు గుర్తించారు. దీంతో నవీన్ ఎవరనే విషయంపై సిబిఐ ఆరా తీసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో సిఎంతో జరిపే సంప్రదింపులకు నవీన్ ఫోన్ నంబరును వినియోగిస్తున్నట్లు సిబిఐ గుర్తించింది. నవీన్ ఫోన్ నంబరు ద్వారా అవినాష్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడారనే దానిపై ప్రస్తుతం సిబిఐ ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే సిబిఐ విచారణకు హాజరు కావాల్సిందిగా నవీన్‌కు నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా పులివెందులలో ఉన్న సిఎం జగన్ ఓఎస్డీ కార్యాలయానికి కూడా సిబిఐ అధికారులు వెళ్ళారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత అవినాష్‌ రెడ్డి, నవీన్ ఫోన్ నంబరు ద్వారా తాడేపల్లిలో ఉన్న కీలక వ్యక్తులతో మాట్లాడినట్లు భావిస్తున్నారు. నవీన్‌ను ప్రశ్నిస్తే ఈ వ్యవహారంలో స్పష్టత వస్తుందని భావించిన సిబిఐ అధికారులు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. విజయవాడలో ఉండే నవీన్‌ను హైదరాబాద్‌ సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. నవీన్‌‌తో పాటు మరో నంబరుకు కూడా అవినాష్‌ రెడ్డి కాల్స్‌ చేయడంతో దాని ద్వారా ఎవరితో మాట్లాడారనే విషయంపై సిబిఐ కూపీ లాగుతోంది. రెండు నంబర్లను వినియోగిస్తున్న వారిని ఈ వారంలో సిబిఐ ప్రశ్నించనుంది.

Related Posts