నెల్లూరు, ఫిబ్రవరి 1,
నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత ముదిరింది. ఇప్పటికే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పై రచ్చ చేయగా, తాజాగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా అవే ఆరోపణలు చేశారు. తాను ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడ్డంలేదని, ఆన్ రికార్డే చెబుతున్నానని చెప్పారు. సొంత పార్టీ వాళ్లే ట్యాప్ చేస్తే ఇక తానెవరికి చెప్పుకోవాలన్నారు ఆనం. తన ఫోన్లు, తన పీఏ ఫోన్లు కూడా ఏడాదిన్నరగా ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లాలో మాఫియా గ్యాంగ్ లు రాజ్యమేలుతున్నాయని తాను ఏడాదిన్నర క్రితం కామెంట్లు చేసినప్పటి నుంచి తన ఫోన్లు ట్యాపింగ్ కి గురవుతున్నాయని అన్నారు. ఆఫ్ ది రికార్డ్ చెప్పాల్సిన ఖర్మ పట్టలేదని, తాను ఆన్ రికార్డే చెబుతున్నానన్నారు రామనారాయణ రెడ్డి. ముఖ్యమైన సందేశాలుంటే వాట్సప్, ఫేస్ టైమ్ యాప్ ద్వారా కాల్స్ చేసుకుంటున్నానని చెప్పారు. కన్న కూతురితో ఫోన్లో మాట్లాడాలనుకున్నా ఫేస్ టైమ్ వీడియో కాల్ లో మాట్లాడుతున్నానని చెప్పారు. అధికార పార్టీయే ట్యాప్ చేస్తున్నప్పుడు ఇక నేనెవరికి చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు. తనకు భద్రత తగ్గించారని.. ఉన్న భధ్రతను కూడా తీసేయాలని ఆనం ప్రభుత్వాన్ని కోరారు. తన ప్రాణానికి ముప్పు ఉందన్నారు. ప్రాణఆలు తీసేందుకు కూడా తెగిస్తున్నారని.. తాను దేనికైనా సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. తాను చనిపోతే తన లాంటి వాళ్లు మరో పది మంది పుట్టుకు వస్తారన్నారు. ఇలాంటి పోకడలు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. స్థానికంగా ఉన్న అధికారులను మార్చడంతో పాటూ తన భద్రతను కూడా తగ్గించారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తులు అధికారం చెలాయిస్తున్నాయని, ఇది సరైన పద్ధతి కాదంటూ హితవు పలికారు. తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు అధికారంలో ఉన్నా తన సెక్యూరిటీని తగ్గించలేదని గుర్తు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో తన ప్రమేయం లేకుండానే సెక్యూరిటీని తొలగించారని తెలిపారు. జగన్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో చూడాల్సి ఉందని ఆనం పేర్కొన్నారు.ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అధికార పార్టీ మెడకు చుట్టుకునే అవకాశముంది. సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారంటే, ఇక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల ఫోన్లు కూడా కచ్చితంగా ట్యాప్ చేస్తుంటారనే అపప్రధ బలపడుతోంది. దీంతో ప్రతిపక్ష పార్టీ ఈ వ్యవహారాన్ని మరింత పెద్దది చేసే అవకాశముంది. నెల్లూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఎవరైనా ఇలాగే ముందుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే కచ్చితంగా దీనిపై ప్రభుత్వం లేదే పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టాల్సి రావొచ్చంటున్నరాు. తమ తప్పు లేదని చెప్పుకోడానికైనా వారు ఏదో ఒక స్టేట్ మెంట్ ఇవ్వాల్సి ఉందని చచెబుతున్నారు. ఇటీవల ఆనంకు వైసీపీకి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. వెంకటగిరి నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యేగా రామనారాయణ రెడ్డి ఉన్నా కూడా పార్టీ తరపున నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇన్ చార్జ్ గా నియమించడంతో కలకలం రేగింది. ఆ తర్వాత క్రమక్రమంగా ఆనం అధికారాలకు కత్తెర పడింది. అధికారుల్ని మార్చేసిన రామ్ కుమార్ రెడ్డి, ఆనంను సభలు, సమావేశాలకు రావొద్దన్నారు. గడప గడప కార్యక్రమానికి కూడా ఆయన్ను తిరగనివ్వడంలేదు. ఈ దశలో ఆనం రామనారాయణ రెడ్డి ఆ ఎపిసోడ్ పై తొలిసారిగా రియాక్ట్ అయ్యారు. రాజ్యాంగేతర శక్తుల్ని నియమించడం సరికాదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను కాదని, రాజ్యాంగేతర శక్తుల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని నిలదీశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు చూశానన్నారు. పోలీస్ సెక్యూరిటీ కూడా తనకు తగ్గించేశారని, ఎవరి ఆత్మవంచనకోసం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఎన్నికలకింకా 15 నెలలు సమయం ఉందన్నారు. నాలుగేళ్ల పాలనలోనే వైసీపీ సమర్థతపై చర్చ మొదలవడం దురదృష్టకరం అన్నారు. రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలే అధికారం కోసం పోటీ పడుతున్నాయని చెప్పారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా ఆనం నోరు విప్పడంతో ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.