న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1,
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2023-2024 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పేదలకు పెద్ద ఉపశమనం కలిగించారు. పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై)ను ఒక సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు చెప్పారు. అంటే వచ్చే ఏడాది పాటు ప్రజలకు ఉచిత రేషన్ అందుతుంది.భారతదేశంలోని ప్రతి ఇంట్లో ఎవరూ ఆకలితో నిద్రపోకూడదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, కరోనా మహమ్మారి సమయంలో మోడీ ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) ను ప్రారంభించింది. నిరుపేదలకు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వాలనే నిబంధన ఉంది. కేంద్ర ప్రభుత్వ పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందుతోంది. ఈ పథకాన్ని సెప్టెంబర్ 2022లో క్లోజ్ చేయాలని అనుకున్నారు. కానీ తరువాత దాన్ని గడువును పొడిగిస్తూ వస్తున్నారు. బడ్జెట్ లో తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు చేరువయ్యేందుకు ప్రయత్నించిందన్నారు నిర్మలా సీతారామన్న. యువతకు, అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక బలాన్ని అందించడమే మా ప్రయత్నమన్నారు. ప్రపంచంలో మాంద్యం ఉన్నప్పటికీ, భారతదేశంలో ప్రస్తుత వృద్ధి రేటు 7 శాతంగా ఉంది. సవాళ్లతో నిండిన ఈ సమయంలో భారత్ వేగవంతమైన అభివృద్ధి దిశగా పయనిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భారత్ అభివృద్ధిని ప్రశంసించారు. వచ్చే 25 ఏళ్లకు ఈ బడ్జెట్ బ్లూప్రింట్. కరోనా మహమ్మారిపై గెలిచి... దేశాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లిందని, భారతదేశం బలాన్ని ప్రపంచం గుర్తించిందని అన్నారు.మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన చివరి పూర్తి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు మాత్రమే మోడీ ప్రభుత్వం సప్లిమెంటరీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. దేశంలోని కోట్లాది మంది రైతులను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అందుకే దేశ ప్రజలు కూడా ఈసారి బడ్జెట్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.