విజయవాడ, ఫిబ్రవరి 2,
వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. ఓ విధంగా రాష్ట్రంలో రెడ్డి రాజ్యం నడుస్తోందంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతేకాదు.. ప్రభుత్వంలో కొలువు దీరిన సలహాదారుల రూపంలో అయితేనేమీ.. వివిధ కార్పొరేషన్ సంస్థల అధిపతులుగా నియమించడంలో అయితేనేమీ.. వివిధ నామినేటేడ్ పోస్ట్‌లు కట్టబెట్టడంలో అయితేనేమీ.. టీటీడీ చైర్మన్, ఈవో వంటి పదవుల విషయంలో అయితేనేమి, శాసన మండలి చైర్మన్, ఈవో పదివిలో అయితేనేమి మొత్తం రెడ్డి సామాజిక వర్గం వారికే మనసా వాచా జగన్ ప్రభుత్వం కట్టబెట్టింది. అయినా కూడా జగన్ సర్కార్ పట్ల రెడ్డి సమాజిక వర్గంలో ఆసంతృప్తి తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం ఉన్న స్థాయిలో రెడ్డి సమాజికవర్గంలో అసంతృప్తి గతంలో ఎన్నడూ లేదని ఆ సమాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఇదే సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రులు .. కాసు బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి , వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితులు ఎదురుకాలేదని చెబుతున్నారు.మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రెడ్లదే రాజ్యమని.. అయితే వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణంతో.. ఆ తర్వాత వచ్చి కె రోశయ్య ప్రభుత్వంలోనే కాదు.. ఆ గద్దెనెక్కిన కిరణ్ కుమార్ ప్రభుత్వం వరకు ఇదే పరిస్థితి కొనసాగిందని.. దీంతో రెడ్లకు దక్కాల్సిన ప్రాధాన్యత ఎక్కడా తగ్గలేదని చెబుతున్నారు.ఇక జగన్.. ముఖ్యమంత్రి అయితే.. తమకు పూర్వ వైభవం వస్తోందని.. తమ సామాజిక వర్గానికి జగన్ ఓ ఆశాకిరణమని ఆ సామాజిక వర్గం వారు భావించారు. వైఎస్ ప్రభుత్వంలో దక్కిన మర్యాద, ప్రాధాన్యత మళ్లీ దక్కుతోందని ఆ సామాజిక వర్గానికి చెందిన వారంతా వైసీపీలో చేరిపోయారు. దీంతో 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కొలువు తీరినా.. ప్రతిపక్షనేతగా వైయస్ జగన్‌కు అత్యంత గౌరవప్రదమైన స్థానం దక్కింది. 2019 ఎన్నికలకు ముందు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువత జగన్ పాదయాత్ర లో రోడ్లు మీదకు వచ్చి మరీ తమ శక్తి కొలది ఖర్చు చేసి.. తమ విలువైన సమయాన్ని సైతం పక్కన పెట్టి.. మరీ జగన్ గద్దెనెక్కేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ గెలుపు.. నల్లేరు మీద నడకే అయిందని..ఈ నేపథ్యంలో తమకు గౌరవం, విలువ దక్కుతోందని సదరు సామాజికవర్గం భావించింది కానీ, జగన్ హయాంలో కనీస గౌరవం కూడా దక్కడం లేదని సదరు సామాజిక వర్గం వాపోతోంది. రెడ్డి సామాజిక వర్గం చూపు తెలుగుదేశం వైపు మళ్లిందని అంటున్నారు. అందుకు ఉదాహరణ.. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి.. అలాగే ప్రకాశం జిల్లా నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఉమ్మడి కడప జిల్లా నుంచి డీఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డి,వరదరాజులు రెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి గంగుల ప్యామిలీ, బైరెడ్డి ప్యామిలీలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు భారీ సంఖ్యలో రెడ్లు... పసుపు కండువా కప్పుకునేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది.