హైదరాబాద్
ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్లో విషాదం అలముకుంది.
కె.విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె మండంలోని పెద పులివర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. కె.విశ్వనాథ్కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.
1980 లో అయన తీసిన శంకరాభరణం సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు. ఆత్మగౌరవం సినిమా అయన తొలి చిత్రం. సాగరసంగమం, శృతి లయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం లాంటి ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు.
సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి 2016లో సినిరంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దీంతోపాటు జాతీయ పురస్కారాలు, నంది అవార్డులు ఆయనకు దక్కాయి.
కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి
కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నా తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ గారు కాలం చేయడం నన్ను కలచి వేసింది. ఈరోజు ఆయన కన్నుమూసిన వార్త విన్న నేను షాక్ కు గురయ్యాను. ఆయన లాంటి డైరెక్టర్ కన్నుమూయటం నాకే కాదు తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.